కశ్మీర్‌పై ట్రంప్‌ మళ్లీ అదే మాట..!

ట్రంప్‌ నోట మళ్లీ అదే మాట. కోరుకుంటే కశ్మీర్‌ సమస్య పరిష్కారంలో సహాయం చేస్తానని వ్యాఖ్యానించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్న...........

Updated : 22 Jan 2020 13:33 IST

దావోస్‌: ట్రంప్‌ నోట మళ్లీ అదే మాట. కోరుకుంటే కశ్మీర్‌ సమస్య పరిష్కారంలో సహాయం చేస్తానని మరోసారి వ్యాఖ్యానించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్న ఆయన.. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలతో పాటు కశ్మీర్‌పై కూడా చర్చ జరిగిందన్నారు. పాకిస్థాన్‌తో మనుపెన్నడూ లేనిస్థాయిలో సత్సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. భారత్‌-పాక్‌ మధ్య సంబంధాల్ని నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు, కశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానంటూ గతంలో పలుసార్లు ట్రంప్‌ చేసిన ప్రతిపాదనను భారత్‌ ఖండించిన విషయం తెలిసిందే. కశ్మీర్‌ పూర్తిగా అంతర్గత వ్యవహారమని.. దీనిపై మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. అయినా.. ట్రంప్‌ ఆ మాటలేవీ పట్టించుకోకుండా కశ్మీర్‌ అంశంపై పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. వచ్చే నెల ట్రంప్‌ భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్‌, ఇమ్రాన్‌ భేటీ ప్రాధాన్యం సంతరించుకొంది.   

కశ్మీర్‌ విషయాన్ని ఇమ్రాన్‌ ఖాన్‌ ‘అతిపెద్ద అంశం’గా అభివర్ణించారు. దీనిపై భారత్‌తో చర్చలు జరిపేందుకు చొరవచూపాల్సిందిపోయి.. అమెరికా మాత్రమే పరిష్కారం చూపగలదని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికలపై తమ వాదన చెల్లకపోవడంతో.. ఓ ద్వైపాక్షిక అంశంలోకి మూడో వ్యక్తి జోక్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని వీడే వరకు కశ్మీర్‌పై పాక్‌తో చర్చించేది లేదని భారత్‌ స్పష్టం చేసింది. ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా.. బయటి జోక్యాన్ని ప్రోత్సహిస్తూ పాక్‌ తన వక్రబుద్ధిని చాటుకుంటోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని