బంగ్లాపై ఎన్‌ఆర్‌సీ ప్రభావం ఉండదు: భారత్‌

జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) వల్ల బంగ్లాదేశ్‌పై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆ దేశానికి భారత్‌ భరోసా ఇచ్చింది. ఇది పూర్తి అంతర్గత వ్యవహారమని మరోసారి...

Published : 03 Mar 2020 00:22 IST

ఢాకా: జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) వల్ల బంగ్లాదేశ్‌పై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆ దేశానికి భారత్‌ భరోసా ఇచ్చింది. ఇది పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని మరోసారి స్పష్టంచేసింది. ఈ మేరకు ఢాకాలో జరిగిన ఓ సెమినార్‌లో భారత విదేశాంగ వ్యవహారాల కార్యదర్శి ష్రింగ్లా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘జాతీయ పౌర పట్టిక పూర్తిగా భారత్‌ అంతర్గత వ్యవహారం. దీనివల్ల బంగ్లాదేశ్‌పై గానీ, ఆ దేశ పౌరులకు గానీ ఎలాంటి చిక్కులు ఉండబోవు అని హామీ ఇస్తున్నా’’ అని ష్రింగ్లా అన్నారు.

అసోంలో ఎన్‌ఆర్‌సీ చేపట్టడంపై బంగ్లాదేశ్‌ అసంతృప్తి వ్యక్తంచేసింది. ఇది తమ అంతర్గత వ్యవహారమని భారత్‌ అప్పట్లో స్పష్టంచేసింది. గతేడాది సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా ఇదే అంశంపై ప్రధాని మోదీతో చర్చించారు. సీఏఏ అనంతరం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్‌ మొమెన్‌, హోంమంత్రి  అసదుజ్జమాన్‌ ఖాన్‌ డిసెంబర్‌లో తమ భారత పర్యటనను వాయిదా వేసుకున్నారు. మరోవైపు భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 17న బంగ్లాదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్‌ వ్యవస్థాపకుడు షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ శతజయంతి వేడుకలకు హాజరవ్వడంతో పాటు బంగ్లా ప్రధాని షేక్‌ హసీనాతో కలిసి ద్వైపాక్షిక చర్చల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని