ఆ రెండు ఛానళ్లపై నిషేధం ఎత్తివేత

కేంద్ర ప్రభుత్వం మీడియా స్వేచ్ఛకు కట్టుబడి ఉందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ శనివారం తెలిపారు. దిల్లీ ఘర్షణలపై విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ప్రసారాలు చేసిన ఛానళ్లపై శుక్రవారం విధించిన నిషేధాన్ని ఎత్తివేసినట్లు తెలిపారు.

Updated : 07 Mar 2020 18:22 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం మీడియా స్వేచ్ఛకు కట్టుబడి ఉందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ శనివారం తెలిపారు. దిల్లీ ఘర్షణలపై విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ప్రసారాలు చేసిన ఛానళ్లపై శుక్రవారం విధించిన నిషేధాన్ని ఎత్తివేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన పుణెలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. దిల్లీ ఘర్షణలపై దేశ వ్యాప్తంగా విద్వేషాన్ని రెచ్చగొచ్చేలా ప్రసారాలు చేశాయని ఆరోపిస్తూ.. కేంద్రం రెండు మలయాళ ఛానళ్లపై చర్యలకు దిగిన విషయం తెలిసిందే. ఆసియా నెట్, మీడియా వన్‌ ఛానళ్లపై 48 గంటల నిషేధాన్ని విధిస్తూ సమాచార, ప్రసారం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

ఈ సందర్భంగా ఏసియా నెట్ సంపాదకులు ఎంజీ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘మంత్రిత్వ శాఖను కలిసి వారిని ఒప్పించడానికి ఎంతో కృషి చేశాం. మా వైపు నుంచి ప్రభుత్వాన్ని ఎలాంటి క్షమాపణ కోరలేం. ఎందుకంటే మేం వాస్తవాలనే ప్రసారం చేశాం’ అని చెప్పారు.  మీడియా వన్‌ ఛానల్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ థామస్‌ మాట్లాడుతూ.. ‘నిషేధంపై తాము న్యాయపరంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. కానీ ఈ లోపే నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. మేం మంత్రిత్వ శాఖలో ఎవర్నీ సంప్రదించలేదు. నిషేధాన్ని ఎత్తివేసినందుకు మేం ఎంతో ఆనందంగా ఉన్నాం. విలువలతో కూడిన జర్నలిజాన్ని కొనసాగిస్తాం’ అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని