ఏడ్చా.. బాధపడ్డా.. భయపడ్డా.. పోరాడా..

‘‘నా కుమార్తెకు న్యాయం జరిగింది. ఆలస్యమైనప్పటికీ చివరకు న్యాయమే గెలిచింది. దోషుల ఉరితో నిర్భయ ఆత్మ శాంతిస్తుంది. ఇంతటితో నా పోరాటం ఆగదు. ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’’ అని దోషుల

Updated : 20 Mar 2020 12:50 IST

నిర్భయ తల్లి ఆశాదేవి మొక్కవోని ధైర్యం

‘‘నా కుమార్తెకు న్యాయం జరిగింది. ఆలస్యమైనప్పటికీ చివరకు న్యాయమే గెలిచింది. దోషుల ఉరితో నిర్భయ ఆత్మ శాంతిస్తుంది. ఇంతటితో నా పోరాటం ఆగదు. ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’’

- దోషుల ఉరి తర్వాత నిర్భయ తల్లి ఆశాదేవి స్పందన ఇది.

ఆమె సంతోషం వెనుక ఏడేళ్లకుపైగా పడిన ఆవేదన ఉంది. చట్టంలోని లొసుగులను వాడుకొని శిక్షను తప్పించుకొనేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలను చూసి ఆమె ఒక దశలో నిస్సహాయంగా ఆక్రోశించారు.. ఏడ్చారు.. బాధపడ్డారు. న్యాయం జరగదేమో అని భయపడ్డారు. కానీ పోరాడటం మాత్రం ఆపలేదు. తన కుమార్తెను అత్యంత పాశవికంగా చంపిన మానవ మృగాలకు శిక్షపడేందుకు ఆమె సుదీర్ఘ న్యాయపోరాటమే చేశారు. ‘దోషులు చట్టాన్ని ఎలా తప్పుదోవ పట్టించారో అందరూ చూశారు. ఇంకా మన వ్యవస్థలో ఇలాంటి లోటుపాట్లు చాలా ఉన్నాయి. చట్టాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది’ అని సాక్షాత్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాలే పేర్కొనడం వాస్తవ పరిస్థితికి అద్దంపట్టింది. ‘నా బిడ్డను రక్షించుకోలేకపోయాను.. ఆమె కోసం పోరాడతా’ అని చెప్పిన మాటలను ఆశాదేవి నిజం చేసి చూపించారు. 

నాడు విలవిల్లాడిన తల్లి గుండె..

అది 2012 డిసెంబర్‌ 16వ తేదీ. రెండు గంటల్లోనే ఇంటికి వచ్చేస్తానని చెప్పి నిర్భయ సాయంత్రం 4 గంటల సమయంలో బయటకు వెళ్లింది. ఇంట్లో ఉన్న రెండు ఫోన్లలో ఒకటి నిర్భయ వద్ద.. రెండోది ఆమె తండ్రి వద్ద ఉంది. తండ్రికి రాత్రి 10గంటల వరకు డ్యూటీ ఉంది. మరోపక్క రాత్రి అవుతున్నా కుమార్తె ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు ఫోన్‌ చేసి మాట్లాడేందుకు చాలాసార్లు ప్రయత్నించారు. చివరకు ఒకసారి రింగ్‌ అయినా.. అవతల వైపు నుంచి కాల్‌ కట్‌ చేశారు. ఆ తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌. దీంతో నిర్భయ తల్లి  కుటుంబసభ్యులతో కలిసి వీధి చివర ఎదురుచూస్తూ నిలబడింది. చాలాసేపటి తర్వాత సఫ్దార్‌జంగ్‌ ఆసుపత్రి నుంచి ఫోన్‌ వచ్చింది. ఆందోళనగా ఫోన్‌ మాట్లాడిన ఆశాదేవికి నిర్భయ గాయపడిందని వైద్యులు చెప్పారు. 

వెంటనే నిర్భయ తల్లిదండ్రులు ఆసుపత్రికి పరుగులు తీశారు. అప్పటికే ఆమెను ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లారు. తర్వాత కొద్దిసేపటికి నిర్భయ కళ్లు తెరిచి తల్లిని చూసి ఏడ్చేసింది. తల్లి ఆశాదేవికి మనుసులో దుఃఖం తన్నుకొస్తున్నా.. బాధను అదిమిపెట్టుకొని ‘ఏమీ కాదులే’ అని కుమార్తెకు ధైర్యం చెప్పింది. కానీ, పరిస్థితి చూసిన ఆశాదేవి బిడ్డ ప్రాణాలు దక్కితే చాలు అని కోరుకొంది. నిర్భయ శరీరం మొత్తం రక్తంతో తడిసిముద్దైపోయింది. ఆమెపై అత్యాచారం జరిగిందని తెలిసింది. ఆ తర్వాత నిర్భయకు శస్త్రచికిత్స మొదలైంది. 

కొద్దిసేపటి తర్వాత ఒక సీనియర్‌ డాక్టర్‌ ఆశాదేవి వద్దకు వచ్చి నా 20 ఏళ్ల సర్వీసులో ఇలాంటి కేసు చూడలేదని చెప్పారు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు ఏం చేయాలో తెలియడంలేదన్నారు. ఎప్పుడు ఏమైనా జరగవచ్చని చెప్పారు. దీంతో నిస్సహాయంగా ఆశాదేవి కుమార్తెను చూస్తూండిపోయారు. కళ్లెదుటే కూతురు మృత్యువుతో పోరాడుతుంటే దేవుళ్లకు మొక్కడం మినహా చేయగలిగిందేమీ లేకపోయింది. ఈ క్రమంలో చికిత్సలో భాగంగా నిర్భయకు నోటి ద్వారా ఎటువంటి ఆహారం, నీరు ఇచ్చేవారు కాదు. ఆ సమయంలో ఒక రోజు తల్లిని నిర్భయ మంచి నీరు అడిగింది.. ఆకలివేస్తోందని చెప్పింది. కానీ, డాక్టర్లు ఆహారం ఇవ్వడానికి అంగీకరించలేదు. కళ్లెదుట మృత్యువుతో పోరాడుతున్న కూతురికి ఆకలిదప్పులు కూడా తీర్చలేకపోయానని ఆశాదేవి ఇప్పటికీ కన్నీటి పర్యంతమవుతుంటారు. 12 రోజులు మృత్యువుతో పోరాడి డిసెంబర్‌ 29న నిర్భయ ప్రాణాలు విడిచింది. 

రగిలిపోయిన భారత్‌..

నిర్భయ ఘటన వెలుగులోకి వచ్చిన డిసెంబర్‌ 17 నుంచి దేశం మొత్తం ఆగ్రహంతో రగిలిపోయింది. ఈ క్రమంలో పోలీసులు దోషులను గుర్తించారు. ఆ మర్నాడే రామ్‌ సింగ్‌తోపాటు మరో ముగ్గురుని అరెస్టు చేశారు. ఈ కేసులో బాల నేరస్థుడిని డిసెంబర్‌ 21న ఆనంద్‌ విహార్‌లో అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు ముఖేశ్‌ను నిర్భయ మిత్రుడిగా గుర్తించాడు. మరోపక్క బిహార్‌, హరియాణాలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఆరో నిందితుడు అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ను అరెస్టు చేశారు. నిర్భయ మరణించగానే వీరిపై ఎఫ్‌ఐఆర్‌లో హత్యానేరాన్ని కూడా జోడించారు. ఆ తర్వాత నాటి సీజే జస్టిస్‌ ఎ.కబిర్‌ ఈ కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేశారు. 

రామ్‌సింగ్‌ ఆత్మహత్య..

ఈ కేసులో కీలక నిందితుడు రామ్‌ సింగ్‌ 2013 మార్చి 11న తిహాడ్‌ జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో బాల నేరస్థుడిని జువైనల్‌ జస్టిస్‌ బోర్డు మూడేళ్లపాటు కరెక్షన్‌ హోమ్‌కు పంపిచింది. మిగిలిన నలుగురు నిందితులకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు సెప్టెంబర్‌ 13న ఉరిశిక్ష విధించింది. హైకోర్టు దీనిని సమర్థించింది. ఈ క్రమంలో దోషులైన ముఖేష్‌, పవన్‌, వినయ్‌ ఉరిశిక్షను సుప్రీం కోర్టు ధ్రువీకరిస్తూ వారి రివ్యూ పిటిషన్లను 2018 జులైలో కొట్టేసింది. కానీ దాదాపు ఏడాది పూర్తికావస్తున్నా డెత్‌వారెంట్లు జారీ కాలేదు. దీంతో శిక్షను అమలు చేయాలని నిర్భయ తల్లిదండ్రులు దిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖలు రాశారు. ఫిబ్రవరి 2019న పటియాలా కోర్టును ఆశ్రయించారు. వీరికి సీమా, జితేందర్‌ అనే న్యాయవాదులు చేదోడువాదోడుగా నిలిచారు. మరోపక్క 2020 జనవరిలోనే దిల్లీ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేయడంతో దోషుల్లో ప్రాణభయం మొదలైంది.  

నలుగురిని ఒకేసారి ఉరితీయాలనే నిబంధనను అడ్డం పెట్టుకొని హైడ్రామకు తెరతీశారు. న్యాయవ్యవస్థలో లొసుగులను వాడుకొనేలా ఒకరి తర్వాత ఒకరు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేశారు. రాష్ట్రపతి తిరస్కరించడంతో వీటిపై మళ్లీ న్యాయస్థానాలకు వెళ్లడం వంటివి చేశారు. అనారోగ్యాలను సాకుగా చూపటం.. ఒక దశలో తమనుతాము గాయపర్చుకొనే ప్రయత్నాలూ చేశారు. ఎట్టకేలకు వీరి తీరును గ్రహించిన న్యాయవ్యవస్థ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మార్చి 20న నిర్భయకు న్యాయం జరిగింది. నలుగురు నిందితులను ఉరితీశారు. 

ఒక్కటే మాటపై..

దేశం మొత్తం ఈ కేసు సంచలనంగా మారడంతో చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు వీరిని పరామర్శించడానికి వచ్చారు. ఈ క్రమంలో ఇంట్లో ఒకరికి ఉద్యోగం వంటి రకరకాల హామీలు వచ్చాయి.. కన్నపేగు బాధకు ఇవేవీ సాంత్వన కల్పించలేదు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని మాత్రమే అడిగారు. ఆ తర్వాత ఏడేళ్లపాటు కేసు ఏ కోర్టులో ఉన్నా కూడా వారు ఇదే మాటమీద ఉన్నారు. ఎక్కడా తొణకలేదు..! ఈ ఏడేళ్లలో కోర్టుల్లో పలుమార్లు కేసు వాయిదాలు పడినా.. విచారణ తేదీలను మార్చినా.. ప్రతిసారీ ఆశాదేవీ మాత్రం కన్నీటితో న్యాయస్థానానికి కచ్చితంగా హాజరయ్యేవారు. 

ఒక దశలో నిర్భయ కుటంబానికి బయట నుంచి డబ్బు వస్తోందని దోషుల కుటుంబీకులు ప్రచారం చేసి అవమానించడం మొదలు పెట్టారు. దీనికి తోడు ఇది సాధారణమైన కేసే అని న్యాయస్థానాలను నమ్మించే ప్రయత్నాలు చేశారు. ‘అత్యాచారం ఒక్కసారి జరగదు.. పదేపదే జరుగుతుంది. సమాజంలో..ఇళ్లలో.. విచారణ సమయంలో జరుగుతూనే ఉంటాయి.. ఎందుకంటే పదేపదే మేము మా కుమార్తెకు ఏం జరిగిందో ప్రతిచోటా నిరూపించాల్సి వచ్చేది. దోషుల న్యాయవాదిని నేను తప్పుపట్టను. వారు అలా చేయడానికి చట్టమే అవకాశం ఇచ్చింది. చట్టంలో ఇన్ని లొసుగులు లేకపోతే ఇలా జరిగేది కాదు’ అని ఆశాదేవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారంటే... ఆమె ఎంత వేదన అనుభవించారో చెప్పొచ్చు. 

ఈ క్రమంలో నిర్భయ కుటుంబ సభ్యులు తమ సమీప బంధువుల ఇళ్లలో జరిగే ఎటువంటి కార్యక్రమాలకు హాజరుకాలేదు. కేవలం తన దృష్టి దోషులకు శిక్షపడటంపైనే కేంద్రీకరించారు. ‘నన్ను చంపుతారనే భయంలేదు.. నా బిడ్డ చనిపోయినప్పుడే నా ప్రాణాలూ పోయాయి’ అని ఆశాదేవి చెప్పేవారు. ఆమె చట్టాన్ని పూర్తిగా నమ్మారు. దోషుల కుటుంబ సభ్యులను ఒక్క మాట కూడా అనలేదు. తన కుమార్తెలా ఎవరూ బాధపడకూడదని ఆమె కోరుకుంటారు. ఇక ముందు కూడా ఇటువంటి కేసుల్లో సత్వర  న్యాయం కోసం తన పోరాటం ఆగదని నేడు ఆశాదేవి చెప్పారు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఇవీ చదవండి: 
దోషుల పూర్వాపరాలు ఇవే..
నిర్భయ దోషుల చివరి క్షణాలు ఇలా..
నిర్భయ దోషులకు ఉరి
నా కుమార్తెకు న్యాయం జరిగింది: నిర్భయ తల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని