మలేరియా మందు వేసుకున్న వైద్యుడి మృతి!

మలేరియాను నయం చేసే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందు వేసుకున్న ఓ వైద్యుడు గుండెపోటుతో మరణించిన సంఘటన అసోంలో చోటుచేసుకుంది.

Published : 31 Mar 2020 13:50 IST

గువాహటి: మలేరియాను నయం చేసే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందు వేసుకున్న ఓ వైద్యుడు గుండెపోటుతో మరణించిన సంఘటన అసోంలో చోటుచేసుకుంది. గువాహటికి చెందిన ఉత్పల్‌జిత్‌ బర్మన్‌(44) స్థానిక ప్రతీక్ష ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఉత్పల్‌కు రెండురోజుల క్రితం గుండెపోటు రావడంతో సమీపంలోని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉత్పల్‌ మరణించాడని వైద్యులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న తరుణంలో ముందుజాగ్రత్తలో భాగంగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందును తీసుకున్నట్లు గుర్తించారు. కరోనా లక్షణాలు ఏవీ లేనప్పటికీ ముందుజాగ్రత్త కోసం ఈ మందు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇదే విషయాన్ని తన తోటి వైద్యులు కూడా ధృవీకరించారు. గుండెపోటుకు కచ్చితమైన కారణం తెలియకపోయినప్పటికీ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ కారణమని వైద్యులు అనుమానిస్తున్నారు. అయితే అసోంలో చాలామంది వైద్యులు దీన్ని ఉపయోగిస్తునట్లు ప్రతీక్ష ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వెల్లడించారు. కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు మాత్రమే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఇవ్వడం వలన ఉపశమనం కలిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను భారత వైద్య పరిశోధన మండలి విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని