
చైనా.. వీటికి జవాబులేవి: అమెరికా
ఆ వైరస్ వుహాన్‌లోనే పుట్టింది.. అక్కడ ల్యాబ్ ఉంది: మైక్ పాంపియో
వాషింగ్టన్: కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పుడే తమ వైద్య బృందానికి అనుమతి ఎందుకివ్వలేదని చైనాపై అమెరికా మంత్రి మైక్ పాంపియో తీవ్ర విమర్శలు చేశారు. బీజింగ్ తమ ప్రశ్నలకు జవాబులు చెప్పాలని, పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు. కొవిడ్-19ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎక్కువ సమయం తీసుకుందని విమర్శించారు. దేశంలోని వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఆ కమ్యూనిస్టు దేశంపై విరుచుకుపడ్డారు.
‘ఆరంభంలో, సరైన సమయంలో, అవసరమైనప్పుడు చైనీస్ కమ్యూనిస్టు పార్టీ అమెరికాకు అనుమతి ఇవ్వలేదు. అధ్యక్షుడు దానిపైనే ఈ రోజు మాట్లాడారు. అక్కడ ప్రయోగశాల ఉందని తెలుసు. మాంసాహార విపణి ఉందని తెలుసు. ఆ వైరస్ వుహాన్‌లోనే పుట్టిందని తెలుసు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పటికీ అమెరికాకు తెలియని సమాచారం ఎంతో ఉంది. అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ పతనమైంది’ అని పాంపియో అన్నారు.
‘మాకిప్పుడు జవాబులు కావాలి. పారదర్శకత కావాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తన కర్తవ్యాన్ని నిక్కచ్చిగా చేయాలి. ప్రపంచానికి సరైన, కాలానుగుణ, సమర్థ, నిజమైన సమాచారం ఇవ్వాలి. వారీ పని చేయలేదు. ప్రపంచానికి మేలు చేసే సంస్థలు అవసరం. ఇది అన్ని దేశాలకు సరైన సమాచారం అందించాలి. కానీ అలా జరగలేదు. ఇలాంటి మహమ్మారులు మళ్లీ రాకుండా జాగ్రత్త పడాలి. అన్ని దేశాలను అప్రమత్తం చేయాల్సిన సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ పని చేయలేదు. అమెరికన్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోని ఆ సంస్థకు అమెరికన్ పన్నుదారుల డబ్బులను ఒక్క డాలర్ కూడా ఇవ్వం’ అని పాంపియో విమర్శించారు.
‘ఆ వైరస్ చైనాలోని వుహాన్‌లో పురుడు పోసుకుంది. ఇవన్నీ నిజాలు. ప్రతి ప్రభుత్వం రెండు పనులు చేయాలని మేం కోరుకుంటున్నాం. ఒకటి ఏం జరుగుతుందో యదార్థంగా చెప్పాలి. దేశంలో కరోనా స్థితిని వివరించాలి. ఎందరు చనిపోయారు? ఎలాంటి కేసులున్నాయి?ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారో వివరించాలి. చైనా అధ్యక్షుడి విషయానికి వస్తే... ఈ వైరస్ బహుశా అమెరికా సైనికులు లేదా అమెరికా ఆయుధ ప్రయోగశాల సృష్టి అంటున్నారు. అలాంటప్పుడు ఇది చాలా రిస్క్. మీరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే నష్టపోతారు. అమెరికన్ల ఆరోగ్యానికి, జీవన శైలికి చైనా ఎనలేని ముప్పు తీసుకొచ్చింది. ప్రపంచానికి తప్పుడు సమాచారం చెప్పింది’ అని పాంపియో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికాలో కరోనా వైరస్‌తో మంగళవారానికి 25,000 మందికి పైగా మృతిచెందారు. 6,05,000పైగా అమెరికన్లు కొవిడ్-19తో బాధపడుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 1,26,722 మంది మరణించారు. బాధితుల సంఖ్య 20 లక్షలు దాటేసింది.
చదవండి: లాక్‌డౌన్ సడలింపు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.