భారతీయుల్లోనే ఎక్కువ ఆందోళన!

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇప్పటికే అత్యధిక దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. అయితే, ఆయా దేశాల పరిస్థితులను బట్టి లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్నాయి. ఈ సందర్భంలో లాక్‌డౌన్‌ అనంతరం ఇంట్లో నుంచి బయటి రావడానికి భారతీయులే ఎక్కువ ఆందోళన చెందుతున్నట్లు తాజాగా ఓ సర్వే వెల్లడించింది.

Updated : 05 May 2020 18:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇప్పటికే అత్యధిక దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. అయితే, ఆయా దేశాల పరిస్థితులను బట్టి లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్నాయి. ఈ సందర్భంలో లాక్‌డౌన్‌ అనంతరం ఇంట్లో నుంచి బయటి రావడానికి భారతీయులే ఎక్కువ ఆందోళన చెందుతున్నట్లు తాజాగా ఓ సర్వే వెల్లడించింది. దేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని కోరుతున్నప్పటికీ దాదాపు 78శాతం ప్రజలు బయటకు రావడంపై ఆందోళన చెందుతున్నారని సర్వే తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా చాలా దేశాల వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. ఈ సమయంలో ప్రజల ఆలోచనపై ప్రముఖ మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ ‘ఇప్పోస్‌’ 14దేశాల్లో ఏప్రిల్‌16 నుంచి 19 మధ్యలో ఓ సర్వే నిర్వహించింది. వీటిలో కేవలం భారత్‌, చైనా, ఇటలీ, రష్యా దేశాల ప్రజలు మాత్రమే లాక్‌డౌన్‌ అనంతరం ఆర్థిక వ్యవస్థలను పునఃప్రారంభించాలని సూచించారు. కాగా మిగతా ఎనిమిది దేశాల ప్రజలు మాత్రం దీన్ని వ్యతిరేకించడం గమనార్హం.

లాక్‌డౌన్‌ అనంతరం ఇళ్లనుంచి బయటకు రావడానికి అత్యధికంగా భారత్‌లోనే(78శాతం) ఆందోళన చెందుతున్నారని సర్వే వెల్లడించింది. అనంతరం జపాన్‌(77శాతం), చైనా(72శాతం), యూకే(71శాతం), అమెరికా(67శాతం) ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడానికి జంకుతున్నట్లు తెలిపింది. కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న జర్మనీలో మాత్రం అతితక్కువగా(44శాతం) మాత్రమే ఇళ్లనుంచి బయటకు రావడం ఆందోళనకరమనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

కరోనా వైరస్‌ ధాటికి అతలాకుతలమైన ఇటలీలో 53శాతం(సర్వేలో పాల్గొన్న వారిలో) ప్రజలు ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించాలని సూచించారు. ఇక భారత్‌లో 51శాతం, చైనాలో 58శాతం దీనికి అనుకూలంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇక కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రష్యాలో కూడా అత్యధిక ప్రజలు(60శాతం) లాక్‌డౌన్‌ ఎత్తివేసి వాణిజ్య రంగాన్ని తెరవాలని సూచించారు. దీన్ని విబేధించిన వారిలో యూకే ముందువరుసలో నిలిచింది. ఇక్కడ దాదాపు 70శాతం ప్రజలు లాక్‌డౌన్‌ సడలింపు ఇవ్వవద్దని, ఆర్థిక వ్యవస్థను తెరవద్దని వెల్లడించారు.

ఇదిలా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటికే రెండున్నర లక్షల మంది మృత్యువాతపడ్డారు. దాదాపు 36లక్షల మందికి ఈ వైరస్‌ సోకింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని