ప్రతి ముగ్గురిలో ఒకరు కోలుకుంటున్నారు 

దేశంలో కరోనా విజృంభణ ఓ వైపు కొనసాగుతుంటే.. మరోవైపు కోలుకున్నవారి సంఖ్యా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3390 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి లక్షణాలతో .......

Updated : 08 May 2020 20:03 IST

* భారత్‌లో రికవరీ రేటు 29.36%  
* కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా 5231 రైల్వే కోచ్‌లు
* ఔరంగాబాద్‌ ఘటన దురదృష్టకరం
* ఆరోగ్య, హోంమంత్రిత్వశాఖ ఉన్నతాధికారుల ప్రెస్‌మీట్‌

దిల్లీ: దేశంలో కరోనా విజృంభణ ఓ వైపు కొనసాగుతుంటే.. మరోవైపు కోలుకున్నవారి సంఖ్యా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3390 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి లక్షణాలతో చికిత్స పొందిన వారిలో 1273 మంది కోలుకోవడం విశేషం. దేశంలో ఇప్పటి వరకు (ఉదయం 8గంటల వరకు) 56,342 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్రంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. ‘‘దేశంలో నమోదైన కేసుల్లో 16,540 మంది కోలుకోగా.. 1886 మంది మరణించారు. ప్రతి ముగ్గురిలో ఒకరు కోలుకుంటున్నారు. కరోనా రోగుల రికవరీ రేటు 29.36శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 37,916 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 3.6 శాతం మంది ఆక్సిజన్‌ సపోర్టుతో చికిత్స పొందుతున్నారు. 4.2శాతం మంది ఐసీయూలో,  1.1శాతం మంది రోగులు మాత్రమే వెంటిలేటర్లపై ఉన్నారు. ప్లాస్మా థెరఫీ చికిత్స ఎంత వరకు సురక్షితం అనే అంశంతో పాటు దాని సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు 21 ఆస్పత్రుల్లో ఐసీఎంఆర్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనుంది’’ అని వివరించారు. 

216 జిల్లాల్లో కేసుల్లేవ్‌

‘‘దేశంలోని 216 జిల్లాల్లో ఇప్పటివరకు కరోనా కేసులు నమోదు కాలేదు. అలాగే, గడిచిన 28 రోజులుగా 42 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదు. 21 రోజులుగా 29 జిల్లాల్లో; 14 రోజులుగా 36 జిల్లాల్లో; ఏడు రోజులుగా 46 జిల్లాల్లో కొత్త కేసులు రాలేదు’’ అని లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. 

కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా 5,231  రైల్వే కోచ్‌లు

‘‘దేశంలో 5,231 కోచ్‌లను రైల్వే శాఖ కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మార్చింది. గుర్తించిన 215 స్టేషన్లలో వాటిని అందుబాటులో ఉంచుతారు. కరోనా బాధితులు, అనుమానితుల కోసం వేర్వేరుగా ఈ కోచ్‌లను సదుపాయాలతో సిద్ధం చేశారు. దేశంలో కరోనా పరిస్థితిని విశ్లేషించి త్వరలోనే సవరించిన రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల వివరాలను రాష్ట్రాలకు పంపిస్తాం’’ అని అగర్వాల్‌ తెలిపారు.

222 రైళ్లలో 2.5 లక్షల మంది తరలింపు

లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులను 222 శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లలో తరలిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ వెల్లడించారు. ఇప్పటి వరకు 2.5 లక్షల మంది వలస కూలీలను స్వస్థలాలకు తరలించినట్టు ఆమె చెప్పారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకొస్తున్నామన్నారు. మాల్దీవుల నుంచి 700 మందిని నౌకలో వెనక్కి తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఔరంగాబాద్‌లో వలస కూలీలపై నుంచి రైలు దూసుకెళ్లిన ఘటన దురదృష్టకరమన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని