కరోనా వైరస్‌పై ఉష్ణోగ్రత ప్రభావమెంత?

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి ఇప్పటికే దాదాపు 3లక్షల మందిని బలితీసుకుంది. మరో 40లక్షల మంది దీనికి బాధితులుగా మారిన విషయం తెలిసిందే.

Published : 12 May 2020 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి ఇప్పటికే దాదాపు 3లక్షల మందిని బలితీసుకుంది. మరో 40లక్షల మంది దీనికి బాధితులుగా మారిన విషయం తెలిసిందే. విస్తృత వేగంగా వ్యాపిస్తోన్న ఈ వైరస్‌ తీవ్రత కొన్నిదేశాలతో పోల్చితే భారత్‌లో తక్కువగానే ఉంది. దీనికి ఇక్కడ వెచ్చని వాతావరణ పరిస్థితులు దోహదపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ సమయంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వైరస్‌ వ్యాప్తి తగ్గుతుందనే విషయాన్ని కొట్టిపారేయలేం. అయినప్పటికీ వేసవి కాలంలో భారత్‌లో ఉండే ఎండల తీవ్రతకు వైరస్‌ పూర్తిగా అదృశ్యం కాదని వైరాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. విశ్వవ్యాప్తంగా ప్రభావం చూపే ఇలాంటి మహమ్మారులపై ఒక్కోసారి ఉష్ణోగ్రతల ప్రభావం ఉండదని భారత్‌కు చెందిన వైరాలజిస్ట్‌ వీరపు నాగసురేష్‌ స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు వైరస్‌ వ్యాప్తిని తగ్గించగలవని ఊహించడం అసమంజసమైన విషయమని నాగసురేష్‌ పేర్కొన్నారు. 

వేసవికాలంలో భారత్‌తోపాటు ఆసియా దేశాల్లో ఉండే వెచ్చని ఉష్ణోగ్రతల కారణంగా కొవిడ్‌-19 వ్యాప్తి తక్కువగానే ఉండే అవకాశం ఉంటుందని అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు గత ఏప్రిల్‌ నెలలో ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉండే ఉష్ణోగ్రత, తేమను పరిగణలోకి తీసుకొని వారు అధ్యయనం చేశారు. అంతేకాకుండా, తాజాగా అమెరికా అధ్యక్షుడి వ్యవహారాల విభాగం కూడా ఇదేవిధమైన నివేదిక ఇచ్చింది. సూర్యరశ్మి, అధిక వేడి, తేమ వైరస్‌ వ్యాప్తిని తగ్గించడంలో దోహదపడతాయని వారి అధ్యయనంలో పేర్కొంది. వీటితోపాటు అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌కు చెందిన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం అధ్యయనం కూడా భారత్‌లోని వెచ్చిని వాతావరణం వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటుందని వెల్లడించింది.

ఇదిలా ఉంటే, వైరస్‌ వ్యాప్తికి ఉష్ణోగ్రతలు, భౌగోళిక స్థితులకు సంబంధం లేదని కెనడియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌ తాజాగా పరిశోధనా పత్రాన్ని ప్రచురించింది. కరోనా వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకోవడంతోపాటు పాఠశాలల మూతవంటి అంశాలు దోహదం చేశాయని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ..భారత్‌లో వైరస్‌ కట్టడి చేయడానికి వీలైనంత సమయం దొరికిందని వైరాలజిస్ట్‌ నాగసురేష్‌ అభిప్రాయపడ్డారు. ఊష్ణోగ్రతలకు సంబంధం లేకున్నా..సాధారణ ఇంటి వాతావరణంలోనూ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. అందువల్ల దేశంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టేవరకూ వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ప్రకృతిలో ప్రతి జీవానికీ ఉండే జీవిత కాలంపై ఉష్ణోగ్రతతో పాటు అక్కడి వాతావరణ పరిస్థితుల ప్రభావం ఉంటుంది. ఈప్రక్రియలో వైరస్‌లు కూడా కొన్ని కణాలపై ఆధారపడి జీవిస్తాయి. ఈ సమయంలో అక్కడి వాతావరణానికి తగ్గుట్లు అవి ప్రవర్తిస్తాయి. వేసవి కాలంలో వైరస్‌ సోకిన వ్యక్తి ద్వారా తుంపరులు బయటి వాతావరణంలోకి వచ్చినప్పుడు వేడి తీవ్రతకు ఆ వైరస్ తన సామర్థ్యాన్ని కోల్పోతుందని నాగసురేష్‌ పేర్కొన్నారు. 

గతంలో ఉన్న సమాచారం ప్రకారం ఉష్ణోగ్రతల ప్రభావం వైరస్‌లపై ఉంటుందని మరికొందరు శాస్త్రవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే వాతావరణ మార్పులకు వైరస్‌ ఎలా స్పందిస్తోందన్న విషయంపై ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవని అంటున్నారు. మెర్స్‌, సార్స్‌ వంటి వైరస్‌ల తీరును పరిశీలించినపుడు అవి అధిక ఉష్ణోగ్రతలకు తక్కువ ప్రభావం చూపించాయని స్పష్టం చేస్తున్నారు. నేషనల్‌ అకెడెమిక్స్‌ ఆఫ్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ చేసిన అధ్యయనంలో కూడా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో ఉష్ణోగ్రతలు, తేమ ప్రభావం చూపాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కేవలం వాతావరణంలోని ఉష్ణోగ్రతలే కాకుండా ఇతర పరిస్థితులు కూడా ప్రభావం చూపినట్లు నిపుణులు తెలిపారు. అయితే, కచ్చితంగా ఉష్ణోగ్రతల వల్ల కరోనా వైరస్‌ తీవ్రత తగ్గుతుందనే విషయంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని