చైనాను ఆంక్షలతో బాదేద్దాం..!

కరోనా వైరస్‌ విషయంలో చైనాపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న అమెరికాలో తాజాగా అక్కడి కాంగ్రెస్‌లో ఓ కీలక బిల్లును ప్రవేశపెట్టారు. మహమ్మారి విజృంభణపై పూర్తి.......

Published : 13 May 2020 11:42 IST

సెనేట్‌లో బిల్లు ప్రవేశపెట్టిన సభ్యులు

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ విషయంలో చైనాపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న అమెరికా.. తాజాగా అక్కడి కాంగ్రెస్‌లో ఓ కీలక బిల్లును ప్రవేశపెట్టింది. మహమ్మారి విజృంభణపై పూర్తి వివరాలిచ్చి సహకరించని పక్షంలో చైనాపై కఠిన ఆంక్షలు విధించాల్సిందేనన్నది బిల్లు సారాంశం. దీన్ని తొమ్మిది మంది కీలక సెనేటర్లు మంగళవారం సెనేట్‌ ముందుంచారు. 

‘ది కొవిడ్‌-19 అకౌంటబిలిటీ యాక్ట్‌’ పేరిట రూపొందించిన ఈ బిల్లులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. వైరస్‌ వ్యాప్తిలో చైనా పాత్రపై జరుగుతున్న అమెరికా, దాని మిత్రపక్షాలు, ఐరాస అనుబంధ సంస్థల విచారణకు డ్రాగన్‌ దేశం నుంచి పూర్తి సహకారం లభించాలని పేర్కొన్నారు. ఈ మేరకు కావాల్సిన సమాచారాన్ని అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో చైనా పూర్తి సమాచారం అందించిందో.. లేదో.. అధ్యక్షుడు ట్రంప్‌ 60 రోజుల్లోగా కాంగ్రెస్‌కు తెలియజేయాలని కోరారు. అలాగే చైనాలోని జంతువిక్రయశాలల్ని సైతం మూసివేయాలని డిమాండ్‌ చేశారు. 

ఒకవేళ సమాచారం అందించడంలో చైనా విఫలమైన పక్షంలో ఆస్తుల్ని స్తంభింపజేయడం, ప్రయాణ నిషేధాలు, వీసా ఉపసంహరణలు, అమెరికా ఆర్థిక సంస్థల నుంచి రుణాల నిలుపుదల, అమెరికన్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో చైనా సంస్థల్ని నిషేధించడం వంటి ఆంక్షలు విధించేందుకు ట్రంప్‌నకు అధికారం దఖలుపడనుందని బిల్లులో స్పష్టం చేశారు.

చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రమేయం లేకుండా అమెరికాకు వైరస్ పాకే అవకాశమే లేదని తాను బలంగా విశ్వసిస్తున్నానని బిల్లు రూపకర్త లిండ్సే గ్రాహం ఆరోపించారు. వైరస్‌ ఎలా వచ్చింది.. దాన్ని ఎలా అరికట్టాలనే దిశగా పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. కానీ, అందుకు చైనా ఏమాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. తాజా చట్టం ద్వారా ఒత్తిడి పెరిగి చైనా సహకరించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. లేనిపక్షంలో ఆంక్షలు విధించాల్సిందేనన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని