
కరోనా కట్టడిలో ఆ దేశాల విజయ రహస్యం!
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచం మొత్తం కరోనా వైరస్ మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటికే 43లక్షలకు పైగా ప్రజలు ఈ మహమ్మారి బారినపడగా దాదాపు 3లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ధనిక, పేద దేశాలనే తేడా లేకుండా అన్ని దేశాలను భయోత్పాతం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దశలో కొన్ని దేశాలు దీన్ని నియంత్రించలేమని చేతులెత్తేయగా మరికొన్ని మాత్రం పోరాడుతూనే ఉన్నాయి. ఈ సమయంలో కొన్ని దేశాలు మాత్రం ఈ మహమ్మారిని నియంత్రించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వాటిలో స్లోవేనియా, జోర్డాన్, ఐస్‌లాండ్, గ్రీస్, వియత్నాం ముందస్తు చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ అమలుచేశాయి. భౌతిక దూరంపై అవగాహన కలిగించడంతోపాటు వేల సంఖ్యలో వైద్య పరీక్షలు నిర్వహిస్తూ కరోనా వైరస్ కట్టడిలో విజయం సాధిస్తున్నాయి.
స్లోవేనియా
కరోనా మహమ్మారితో అతలాకుతలమైన ఇటలీపక్కనే స్లోవేనియా ఉన్నప్పటికీ కరోనా వైరస్‌పై ముందుగానే మేల్కొంది. అక్కడి ప్రధాన మంత్రి రాజీనామా చేయడంతో మార్చి 13నే అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలోనే కరోనా విస్తృతి గమనించిన ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను అమలులోకి తెచ్చిన ప్రభుత్వం కారణం లేకుండా ఎవ్వరినీ బయటకు అనుమతించలేదు. ఆ సమయంలో అనుమానం కలిగిన ప్రతిఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక రక్షణ పరికరాలను అందరికీ అందుబాటులో ఉంచింది. కరోనా కట్టిడిలో స్లోవేనియా విజయం సాధించడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. అక్కడి ప్రజల స్పందన, ఆ దేశ మెరుగైన ఆరోగ్య వ్యవస్థలతో పాటు అక్కడి నిబద్ధత గల వైద్య సిబ్బంది ఎంతో దోహదం చేశాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ సందర్భంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని అమలుచేస్తూ, నిబంధనలను కచ్చితంగా పాటించారు. అత్యవసర వస్తువుల ఉత్పత్తి మినహా అన్ని రకాల ఉత్పత్తులను ఆసివేసింది. అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయనప్పటికీ విదేశీయుల రాకను నియంత్రించారు. 14రోజుల క్వారంటైన్ అమలుపరచడంతోపాటు వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించడంతోపాటు ప్రజలనుంచి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని సేకరించారు. ప్రపంచంలో ఇలాంటి కట్టుదిట్టమైన చర్యలు ఏ దేశంలోనూ చూడలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు.
పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న స్లోవేనియాలో మార్చి 4న తొలి పాజిటివ్ కేసు నిర్ధారణ అయ్యింది. అనంతరం రెండు వారాల్లోనే దేశంలోని పాఠశాలలు, వాణిజ్య కార్యకలాపాలు, రవాణా వ్యవస్థ నిలిపివేశారు. దేశవ్యాప్తంగా షట్‌డౌన్ విధించి.. ఉద్దీపన కింద దాదాపు 3బిలియన్ల యూరోలను తమ పౌరులకు అందించింది. మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో సరైన సమయంలో అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కరోనా నియంత్రణకు ఎంతగానో దోహదం చేశాయి. ప్రస్తుతం అక్కడ 1460 పాజిటివ్ కేసులు నమోదుకాగా 102మరణాలు సంభవించాయి.
జోర్డాన్
అరబ్ దేశాల్లో ఒకటైన జోర్డాన్‌లో కరోనా వైరస్‌ను అనతికాలంలోనే కట్టడిచేసింది. మార్చి 2న తొలి పాజిటివ్ కేసు నమోదయ్యింది. అప్పటికి ఐదు వారాల ముందే ఈ వైరస్ ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఒకవేళ కరోనా కేసులు నమోదైతే రోగులకు ఏయే ఆసుపత్రిలో చికిత్ప చేయాలి?, ఆసమయంలో వైద్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోగులకు ఎలా చికిత్స చేయాలనే విషయాలపై అవగాహన కల్పించింది. అంతేకాకుండా రాజు ఆదేశాల మేరకు లాక్‌డౌన్, కర్ఫ్యూను కచ్చితంగా అమలుచేసేందుకు మిలటరీకి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి చర్యలతో వైరస్‌ను కట్టడి చేయడంతో దేశంలో పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యను తగ్గించుకోగలిగింది. ఇప్పటివరకు దేశంలో 560 పాజిటివ్ కేసులు, 9మరణాల సంభవించాయి.
ఐస్‌లాండ్
తక్కువ జనాభా కలిగిన ఐస్‌లాండ్‌లో 1800 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా స్వల్ప లక్షణాలు కలిగిన వారిని వెంటనే గుర్తించి ఐసోలేషన్ ఉంచే ప్రక్రియ ముమ్మరం చేసింది అక్కడి ప్రభుత్వం. ఇలా చేయడం ద్వారా వైరస్‌ను ఇతరులకు సోకడాన్ని నివారించగలిగింది. దీంతో మరణాల సంఖ్యనూ నియంత్రించగలిగింది. ఇప్పటివరకు ఐస్‌లాండ్‌లో వైరస్ సోకినవారిలో 10మంది మరణించారు.
గ్రీస్
ఇక అత్యధిక వృద్ధ జనాభా కలిగిన గ్రీస్ కరోనా కట్టడిలో అందర్నీ ఆశ్చర్య పరిచింది. అంతేకాకుండా పర్యాటకంపైనే ఎక్కువ ఆధారపడే గ్రీస్ సరైన సమయంలో లాక్‌డౌన్ అమలుపరిచింది. మెరుగైన ఆరోగ్య వ్యవస్థ ఉన్న గ్రీస్‌లో భౌతికదూరంపై ప్రజల్లో అవగాహన కల్పించింది. ఈస్టర్ సమయంలోకూడా ప్రజలు పెద్దఎత్తున గుమిగూడకుండా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా పర్యాటకులు తమ దేశంలోని రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. దీంతో దేశంలో 2700పాజిటివ్ కేసులు, 150 మరణాల వద్దే నియంత్రించగలిగింది. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో వేసవిలో తమ దేశానికి పర్యాటకులు రావొచ్చని ఆహ్వానం పలకడం గమనార్హం.
వియత్నాం
ఇక కరోనా మహమ్మారి పుట్టిన చైనాకు సరిహద్దు కలిగిన వియత్నాం కొవిడ్-19ను సమర్ధవంతంగా ఎదుర్కొంది. ఇప్పటివరకు ఇక్కడ కేవలం 288పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయంటే ఈ వైరస్‌ను ఎంతలా కట్టడి చేసిందో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో ఒక్కరుకూడా మరణించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల కన్నా ముందే వియత్నాం కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. పాజిటివ్ కేసులు నమోదవుతున్నా కొద్దీ వారి కాంటాక్ట్‌లను ట్రేస్ చేసి వారిని క్వారంటైన్‌లో పెట్టడం ద్వారా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టగలిగింది. చైనాలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న సమయంలోనే వియత్నాం ముందస్తు చర్యలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇలా ఆదిలోనే మేల్కోన్న ఈ దేశ ప్రభుత్వాలు తీసుకున్న చర్యల ఫలితంగా కరోనా వైరస్‌ను పూర్తిస్థాయిలో కట్టడి చేయగలిగాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.