అక్కడ తెరుచుకోనున్న జిమ్‌లు

లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన జిమ్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్లు కర్ణాటకలో త్వరలో తెరుచుకోనున్నాయి. లాక్‌డౌన్‌-3 గడువు ఈ నెల 17తో ముగిసిన అనంతరం.....

Published : 13 May 2020 22:55 IST

బెంగళూరు: లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన జిమ్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్లు కర్ణాటకలో త్వరలో తెరుచుకోనున్నాయి. లాక్‌డౌన్‌-3 గడువు ఈ నెల 17తో ముగిసిన అనంతరం రాష్ట్రంలో వీటిని తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక పర్యాటకశాఖ మంత్రి రవి సూచనప్రాయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఫిట్‌నెస్‌ సెంటర్లు, గోల్ఫ్‌ కోర్సులు, హోటల్స్‌ తెరిచే విషయమై సీఎంను కలిశానని అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.

క్రీడాకారులకు ఫిట్‌నెస్‌ ఎంతో అవసరమని, లాక్‌డౌన్‌ వారిపై ప్రభావం చూపిందని సీఎంకు వివరించినట్లు మంత్రి తెలిపారు. భౌతికదూరం పాటిస్తూనే వీటిని తెరిచే అంశమై వివరించగా.. తెరుస్తామని సీఎం చెప్పారని మంత్రి పేర్కొన్నారు. గోల్ఫ్‌ కోర్సుల్లో సాధారణంగానే భౌతిక దూరం పాటిస్తారని, ఇదే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా అందుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రణాళికను సీఎంకు వివరించానని చెప్పారు. అందుకోసం ‘రండి మా నగరాన్ని చూడండి’ అనే కార్యక్రమం ద్వారా స్థానిక పర్యాటకులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. తర్వాత అంతర్‌ జిల్లా ప్రజలకు అవకాశం ఇస్తామన్నారు. అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ పర్యాటకుల గురించి తర్వాత ఆలోచన చేస్తామన్నారు. పర్యాటక రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ కోసం వేచి చూస్తున్నామని, ఇది తప్పకుండా ఈ రంగానికి ఊరట కల్పించేలా ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని