నా అన్న ప్రాణం విలువ కేవలం $20 కాకూడదు...

తన సోదరుడి ప్రాణం విలువ కేవలం 20 డాలర్లు కాదని... ఇకనైనా జాత్యంహంకారంతో కూడిన హింసను ఆపాలని మృతుడు జార్జ్‌ సోదరుడు విజ్ఞప్తి చేశారు.

Published : 12 Jun 2020 01:05 IST

విలపించిన అమెరికా మృతుడి సోదరుడు

వాషింగ్టన్‌: తన సోదరుడి ప్రాణం విలువ కేవలం 20 డాలర్లు కాకూడదని, ఇకనైనా జాత్యహంకారంతో కూడిన హింసను ఆపాలని... పోలీసుల దౌర్జన్యం వల్ల మరణించిన ఆఫ్రికన్‌-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ సోదరుడు ఫిలోనిస్‌ ఫ్లాయిడ్‌ విజ్ఞప్తి చేశారు. మే 25న ఓ దుకాణంలో సిగరెట్లు కొన్న జార్జ్‌, 20 డాలర్ల నోటు చెల్లించారు. అయితే ఆ నోటు నకిలీదనే అనుమానంతో దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడకు చేరుకున్న మినియాపోలిస్‌ నగర పోలీసులు జార్జ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు జార్జ్‌ మెడను సుమారు తొమ్మిది నిముషాల పాటు మోకాలితో అదమి పట్టడంతో ఆయన మరణించారు. ఈ ఘటనకు నిరసనగా అగ్రరాజ్యంలో పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

కాగా, జార్జ్‌ మృతికి దారితీసిన పోలీసు దౌర్జన్యం, జాత్యహంకారం వంటి అంశాలపై విచారణకు అమెరికా ప్రభుత్వం ప్రజా ప్రతినిధులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బుధవారం ప్రారంభమైన కమిటీ విచారణ సందర్భంగా జార్జి సోదరుడు ఫిలోనిస్‌ ఫ్లాయిడ్‌... ‘‘ఆరోజు మా సోదరుడు ఎవరినీ గాయపరచలేదు. కేవలం 20 డాలర్ల కోసం మా అన్న ప్రాణాలు పోయాయి. ఓ నల్ల జాతీయుడి ప్రాణం విలువ అంతేనా? జార్జ్‌ ప్రాణాల విలువ అంతకంటే ఎక్కువ. మా అందరి ప్రాణాలకు విలువ ఉంది. నల్లవారి ప్రాణాలకు విలువ ఉంది. నా సోదరుడు సహాయం కోసం అర్ధించినప్పుడు ఎవరూ స్పందించలేదు... ఇప్పుడు నేను, నా కుటుంబం, వీధుల్లో నిరసనలు తెలుపుతున్న ప్రజలు, ప్రపంచం మొత్తం అడుగుతున్నాము... దయచేసి స్పందించండి. ఇంతవరకు జరిగింది చాలు. ఇది 2020... ఇకనైనా దీనిని (జాత్యహంకారం) ఆపండి. ఈ హింసను ఆపండి. మా అన్న మరణం వృధాగా పోకుండా చూడటం మీమీదే ఆధారపడి ఉంది.’’ అని విలపించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని