పాక్‌లో అసలేం జరిగింది?

సుమారు 12 గంటల పాటు నిర్భంధంలో ఉన్న సదరు అధికారులను, నిబంధనలకు విరుద్ధంగా హింసకు గురిచేసినట్టు తెలిసింది.

Published : 17 Jun 2020 01:11 IST

కర్రలతో కొట్టి.. మురికినీరు ఇచ్చి...

దిల్లీ: పాక్‌లో ఇరువురు భారతీయ దౌత్యాధికారులు అంతర్ధానమైన ఘటనలో.. భారత్‌ జోక్యం చేసుకుని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంతో వారిని కొద్ది గంటల అనంతరం విడుదల చేశారు. భారత అధికారులు ఓ వ్యక్తిని ఢీకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించటంతో వారిని అరెస్టు చేశామని పాక్‌ పోలీసులు మొదట ప్రకటించారు. అయితే దౌత్యపరమైన రక్షణ ఉండటంతో అధికారులను భారత హై కమిషన్‌కు తిరిగి అప్పగించారు. అయితే సుమారు 12 గంటల పాటు నిర్బంధంలో ఉన్న వారిని నిబంధనలకు విరుద్ధంగా హింసకు గురిచేసినట్టు తెలిసింది. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...

* పాక్‌ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 8:30 గంటలకు ఇద్దరు భారత అధికారులను, ఆరు వాహనాల్లో వచ్చిన 15 నుంచి 16 వ్యక్తులు ఓ పెట్రోల్‌ బంకు వద్ద అదుపులోకి తీసుకున్నారు.

* పరిసరాలు కనిపించకుండా అధికారుల తలకు ఓ సంచిని తగిలించారు... చేతులకు బేడీలు వేశారు.
*వాహనంలో సుమారు 10 నిముషాల ప్రయాణించిన అనంతరం... ఓ గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు.
*అక్కడ సుమారు ఆరు గంటల పాటు ఇంటరాగేషన్‌ నిర్వహించారు. ఆ క్రమంలో కర్రలు, ఇనప రాడ్లతో అనేకమార్లు కొట్టారు. తాగేందుకు నీరు అడగగా, మురికినీరు ఇచ్చారు.
*నేరం చేసినట్టు ఒప్పుకోవాల్సిందిగా వారిని బలవంతం చేశారు. భారత్‌కు చెందిన ఇతర దౌత్యాధికారులకు కూడా ఇదే గతి పడుతుందంటూ హెచ్చరించారు.
*అనంతరం రాత్రి 9 గంటలకు వారిని భారత హై కమిషన్‌కు అప్పగించారు.
*అధికారుల మెడ, ముఖం, తదితర శరీర భాగాలపై దాడికి గురయిన చిహ్నాలున్నాయి. అయితే ప్రాణాలకు ప్రమాదం కలిగించేంత తీవ్ర గాయాలు లేవని వైద్య పరీక్షల్లో తేలింది.

ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టారని తొలుత చేసిన ఆరోపణలకు విరుద్ధంగా... వారు ప్రయాణిస్తున్న కారులో రూ.10,000 విలువగల పాక్‌ కరెన్సీ నోట్లు లభించినట్టు ఇస్లామాబాద్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కాగా, ఈ ఆరోపణలు అబద్ధమని, నిరాధారమని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దిల్లీలోని పాక్‌ వీసా కేంద్రంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు గూఢచర్యానికి పాల్పడటాన్ని గుర్తించిన భారత్‌ వారిని మే 31న స్వదేశానికి పంపింది. ఇందుకు ప్రతీకారంగా దాయాది దేశం ఈ దాడులకు పాల్పడుతోందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో పాక్‌లో దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని