భారత్‌ గుర్తుంచుకో..  గల్వాన్‌ @ 1962 

చైనా.. పొరుగుదేశాలకు వెన్నుపోటు.. మిత్రద్రోహం.. వంటి వాటికి ఇది పర్యాయపదం.  ఇవేవీ అకారణంగా ద్వేషంతో అనే మాటలు కాదు.. చరిత్ర చెబుతున్న సత్యం. నమ్మించి మోసం చేయడం డ్రాగన్‌కే సాధ్యం.

Updated : 08 Jul 2020 16:11 IST

 చరిత్ర పునరావృతం కాకూడదు

  చైనాను ఏ దశలో నమ్మలేము 

నమ్మకద్రోహానికే బలైన కర్నల్‌ సంతోష్‌బాబు

ఇంటర్నెట్‌డెస్క్‌ప్రత్యేకం

చైనా.. పొరుగుదేశాలకు వెన్నుపోటు.. మిత్రద్రోహం.. వంటి వాటికి ఇది పర్యాయపదం.  ఇవేవీ అకారణంగా ద్వేషంతో అనే మాటలు కాదు.. చరిత్ర చెబుతున్న సత్యం. నమ్మించి మోసం చేయడం డ్రాగన్‌కే సాధ్యం. తాజాగా టిబెట్‌లో సైనిక విన్యాసాల పేరుతో బలగాలను పోగేసి భారత్‌ భూభాగాలను ఆక్రమించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో గల్వాన్‌ లోని పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 వద్ద చైనా దళాలు తిష్ఠవేయడంతో జూన్‌ 6న చర్చలు జరిపి అక్కడి నుంచి ఇరువర్గాలు వెనక్కి వెళ్లాలని నిర్ణయించాయి. కానీ, చైనాదళాలు వెనక్కి వెళ్లినట్లే వెళ్లి మళ్లీ అక్కడికే వచ్చాయి. 16వ బిహార్‌  రెజిమెంట్‌లో కమాండింగ్‌ ఆఫీసర్‌ కర్నల్‌ సంతోష్‌బాబు బృందం అక్కడకు తనిఖీలకు వెళ్లగా దాడి చేసి హత్య చేయడం నమ్మించి మోసం చేయడమే.  ఆ ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు అమరులుకాగా.. చైనాకు చెందిన 40మంది సైనికులు మరణించారు.  అందుకే తాజాగా జరిగిన సైనిక ఒప్పందం కూడా పూర్తిగా అమలయ్యేవరకు చైనాను ఏమాత్రం నమ్మలేము. 

చైనా శాంతి కోరుకోవడంలేదా..?

గల్వాన్‌ ఘర్షణ తర్వాత మొదలైన చర్చలు కొంత మేరకు సఫలమై చైనా దళాలు గల్వాన్‌లోని పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 నుంచి  3 కిలోమీటర్ల మేరకు నిస్సైనికీకరణ చేయాలని నిర్ణయించాయి. అంటే భారత్‌ ఆధీనంలోని పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 ఇప్పుడు నిస్సైనికీకరణ ప్రాంతంలోకి వెళ్లినట్లే కదా..? ఈ విషయాన్ని పక్కనపెడితే.. హాట్‌స్ప్రింగ్స్‌, గోగ్రా ప్రాంతాల నుంచి కూడా ఇరుదేశాల  దళాలు వెనక్కి తగ్గాయి.  కానీ, కీలకమైన పాంగాంగ్‌ సరస్సు వద్ద ఫింగర్‌4 పై మాత్రం చైనా దళాలు వెనక్కి తగ్గలేదు.  ఇక్కడ ఇప్పటికే 190 నిర్మాణాలు చేపట్టినట్లు స్పష్టమవుతోంది. ఈ ఫింగర్ 4 కూడా భారత్‌ను వెన్నుపోటు పొడిచి చైనా చొచ్చుకొచ్చిన ప్రాంతమే. 

ఈ సరస్సు టిబెట్‌ వరకు 604 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది.  వాస్తవాధీన రేఖ ఈ సరస్సుమీద నుంచి పోతుంది. ఈ సరస్సు ఉత్తర తీరాన బంజరు పర్వతాలు ఉన్నాయి. వీటిని ఇరు దేశాల సైన్యాలు  ‘ఫింగర్స్‌’గా అభివర్ణిస్తాయి. ఈ వేళ్ల దగ్గర లెక్కలే ప్రస్తుతం వివాదానికి కారణంగా మారాయి. భారత్‌ ‘ఫింగర్‌ 8’ నుంచి వాస్తవాధీన రేఖ వెళుతుందని చెబుతుంది.. భౌతికంగా మాత్రం ఫింగర్‌ 4 వరకే పట్టు ఉంది. కానీ చైనా సైన్యంకు ఫింగర్‌ 8 వద్ద సరిహద్దు పోస్టు ఉంది.. అయినా ఫింగర్‌ 2 వరకు తమదే అని వాదిస్తోంది.  భారత్‌కు ‘ఫింగర్‌4’ చాలా వ్యూహాత్మకమైంది. ఇక్కడకు శత్రుబలగాలు వస్తే భారత్‌ పాంగాంగ్‌ సరస్సులో గస్తీకి వినియోగించే బోట్ల సంఖ్య, వాటి వద్ద మన సైన్యం కదలికలు శత్రువులకు తేలిగ్గా తెలిసిపోతాయి. ఫింగర్‌ 4 నుంచి చూస్తే భారత్‌ మరపడవలను నిలిపే లుకుంగ్‌ ప్రాంతం స్పష్టంగా కనిపిస్తుంది.

ఇది వెన్నుపోటు కాదా..?

కార్గిల్‌ యుద్ధ సమయంలో బలగాల అవసరం ఉండటంతో ఈ సరస్సు వద్ద కొంత మందిని అటువైపు మళ్లించారు. ఇదే అదునుగా భావించిన చైనా సైన్యం ఈ  ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టి మెల్లగా  ఫింగర్ 4 వరకు వచ్చింది. భారత్‌వైపు ప్రాంతాలు నిట్టనిలువుగా ఉండటం.. చైనా వైపు ప్రదేశం ప్రయాణాలకు అనుకూలంగా ఉండటం డ్రాగన్‌కు కలిసొచ్చింది. దీంతో అవి నేరుగా ఫింగర్‌ 4పైకి చేరి తిష్ఠవేశాయి.  ఇప్పుడు భారత్‌కు చెందిన ఈ ప్రాంతాన్ని మాత్రం వెనక్కి ఇవ్వడానికి డ్రాగన్ సుముఖంగా లేదు. అసలు గల్వాన్‌ లోయలో వెనక్కి వెళ్లడానికి మరోకారణం ఉంది. ఇప్పటి వరకు చైనా ఆక్రమణలో ఉన్న ప్రదేశం వరదలో మునిగిపోతుంది. ప్రస్తుతం గల్వాన్‌ నదికి వరదలు వచ్చే సీజన్‌ . దీంతో ఆ దళాలు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. 

1962 యుద్ధానికి ముందు అచ్చం ఇలానే..
భారత్‌ను 1962లో కూడా గల్వాన్‌ లోయలో చైనా  నమ్మించి మోసం చేసింది. చైనా అప్పట్లో కూడా గల్వాన్‌లో లోయలోకి తమ దళాలను పంపింది. ఆ తర్వాత  భారత్‌ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ హెచ్చరికలు జారీ చేయడంతో అక్కడి నుంచి వైదొలగింది. కానీ, 97 రోజుల తర్వాత హఠాత్తుగా భారత్‌పై దాడిని ప్రారంభించి అక్సాయ్‌చిన్‌ను దక్కించుకొంది. ఈ యుద్ధంలో భారీ సంఖ్యలో భారత్‌ యోధలు అమరులయ్యారు. 38,000 చదరపు కిలోమీటర్లను చైనా ఆక్రమించింది.  భారత్‌  ఈ సారి సైనిక ఉపసంహరణ విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉండకూడదు. ఉపగ్రహాలు, డ్రోన్లతో తనిఖీ చేయడంతోపాటు సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు తమ దళాలను బలోపేతం చేసుకోవాలి. దీంతోపాటు భౌతికంగా కూడా దళాలకు చెందిన ప్రతినిధులను పంపించి చైనా అన్నమాట నిలబెట్టుకొన్నదని నిర్ధారించుకోవాలి. ఎందుకంటే అది చైనా.. ఏం చేసైనా భూభాగాలను మింగేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని