Corona: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ విజృంభణ.. ఒక్కరోజులో 7 లక్షల కేసులు..

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.

Updated : 07 Aug 2021 09:44 IST

అమెరికాలో లక్షకు పైగా.. 

వాషింగ్టన్‌ / బీజింగ్‌ : ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. అమెరికాలో అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. చైనాలోనూ కొత్త కేసులు బయటపడుతున్నాయి. దాదాపు రెండున్నర నెలల్లో ఎన్నడూ లేనివిధంగా గురువారం ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలకు పైగా రోజువారీ కేసులు నమోదయ్యాయి. ‘వరల్డ్‌ మీటర్‌’ గణాంకాల ప్రకారం మే 14 తర్వాత ఇంత ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రధానంగా సాంక్రమిక శక్తి ఎక్కువగా ఉన్న కరోనా వైరస్‌ డెల్టా రకం 135 దేశాల్లో వ్యాప్తి చెందింది. బ్రెజిల్, రష్యా, బ్రిటన్, ఇరాన్‌ సహా పలు దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇండొనేసియాలో మరణాలు పెరుగుతున్నాయి.

అమెరికాలో మూడింతలకు పైగా..

అమెరికాలో గత 3 రోజులుగా లక్షకు పైగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. డెల్టా రకం వ్యాప్తి పెరుగుతోంది. గత నెల రోజుల్లో ఆసుపత్రుల పాలయ్యే బాధితుల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా ‘సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ)’ సమాచారం మేరకు ఈ సంఖ్య సగటును 12 వేల నుంచి 43 వేలకు పెరిగింది. దేశవ్యాప్తంగా గురువారం 24 గంటల్లో 
1.20 లక్షల మందికి పైగా కొవిడ్‌ బారిన పడ్డారు. అత్యధికంగా ఫ్లోరిడాలో 20 వేలకు పైగా కొత్త కేసులు బయట పడగా.. టెక్సాస్, కాలిఫోర్నియాల్లో ఈ సంఖ్య 10 వేలు దాటింది. అమెరికాలో ఫిబ్రవరి రెండో వారం తర్వాత మళ్లీ ఈ వారంలోనే రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి. ఆసుపత్రుల పాలవుతున్నవారిలో ఫ్లోరిడా, జార్జియా, లూసియానాల్లోనే 40% మంది ఉన్నారు.

చైనాలో మళ్లీ కట్టడి చర్యలు..

చైనాలోనూ డెల్టా రకం కేసులు పెరుగుతున్నాయి. స్థానిక వ్యాప్తి ద్వారా శుక్రవారం 80 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. వీటిలో 58 కేసులు జియాంగ్సు ప్రావిన్సులోని యాంగ్‌ఝౌ నగరంలోనే బయటపడ్డాయి. ఇక్కడ డెల్టా రకం వ్యాప్తి ఎక్కువగా ఉంది. మరో 6 ప్రావిన్సుల్లో మిగతా కేసులు నమోదయ్యాయి. చైనాలో గత ఏడాది కొవిడ్‌ అదుపులోకి వచ్చిన తర్వాత ఇటీవల మళ్లీ వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. తాజా ఉద్ధృతి నాన్‌జింగ్‌ విమానాశ్రయంలో కేసులు బయటపడటంతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈమేరకు కొద్ది రోజులుగా బయటపడిన కేసుల సంఖ్య 1,200 దాటింది. దీంతో చైనా మళ్లీ కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. నాన్‌జింగ్‌ సహా పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లు విధించింది. ప్రజలను ఇళ్లకే పరిమితం చేయడంతో పాటు, అన్ని రకాల ప్రయాణాలపై నిషేధం విధించింది. 
 *బ్రెజిల్‌లో రోజువారీ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. గురువారం 24 గంటల్లో 40 వేల మందికి పైగా కొవిడ్‌ బారిన పడగా.. 1,086 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండొనేసియాలో 1,700 మందికి పైగా మృతి చెందారు. రోజువారీ కేసులు సగటున 35 వేలకు పైగా నమోదవుతున్నాయి. ఇరాన్‌లోనూ ఒక్క రోజులో 38,674 కేసులు బయటపడ్డాయి. బ్రిటన్‌లో తాజాగా 30,215 మందికి కొవిడ్‌ సోకింది. రష్యా, టర్కీ, ఫ్రాన్స్, మెక్సికోల్లోనూ 20 వేలకు పైగా రోజువారీ కేసులు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని