
75th independence day: అమృతం కురిసిన ధాత్రి!
నదులకు నడక నేర్పాం. ప్రాజెక్టులు కట్టాం. మాగాణాలకు జలాభిషేకం చేశాం. హరితసీమలను అభివృద్ధి చేసుకున్నాం. పారిశ్రామికంగా పురోగతి సాధించాం. విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, ఉపాధి... ఇలా ఎన్నో అంశాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల దిశగా పరిశ్రమిస్తున్నాం. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, టెలికమ్యూనికేషన్స్, అంతరిక్ష పరిజ్ఞానం, ఔషధ రంగాల్లో అగ్రదేశాలకు దీటుగా వృద్ధి సాధించాం. స్వాతంత్య్రం ఇస్తే అధికారం కోసం భారతీయులు కొట్టుకు చస్తారు. మనం అధికారాన్ని చేతగాని దద్దమ్మలకు అప్పగిస్తున్నాం. కొన్నేళ్ళలో ఇండియా అనేది పూర్తిగా కనుమరుగవుతుంది.స్వాతంత్య్ర ప్రకటనకు ముందు అప్పటి బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ చేసిన వ్యాఖ్యలివి! చర్చిల్ ఒక్కడే కాదు... యావత్ ప్రపంచం భారత్ ఎలా నిలబడుతుందా అని ఆశ్చర్యంగా చూసింది! ఇప్పుడూ ఆశ్చర్యంగానే చూస్తోంది- ఎలా నిలదొక్కుకుందా అని! నిజంగానే ఎలా సాధ్యమైంది ఈ ఎదుగుదల అని అమృతోత్సవ వేళ అవలోకిస్తే.... భారత్‌ను నవజవ్వనిగా నిలబెడుతున్న 5 అమృత బిందువులు కనిపిస్తాయి!
1)సమ్మిళితం-బహుళపక్షం
సుమారు 2 వేల భాషలు... ప్రపంచంలోని దాదాపు అన్ని మతాల ప్రజలు... కులాలు, వర్గాలు... సామాజిక అంతరాలు... ఇలా ప్రపంచంలోని వైవిద్యమంతా ఇక్కడే ఉంది. అన్నింటినీ ఇముడ్చుకొని వెళ్ళగల సామర్థ్యం భారత్ సొంతం. చరిత్రలో ఎన్ని దాడులకు గురైనా, దండయాత్రలు జరిగినా... వందల ఏళ్ళపాటు విదేశీపాలనలో కొనసాగినా భారతావని కోల్పోని గుణం సమ్మిళితం! అంద]రినీ తనలో ఇముడ్చుకునే లక్షణం... భారత్‌ను విలక్షణంగా నిలబెడుతోంది. ఎన్నో వైవిధ్యాలున్నా, ఎన్నో బహుళత్వాలున్నా అన్నింటినీ దండలో దారంలా కలిపి ఉంచుతోంది భారతీయత. వేల సంవత్సరాలుగా సాగుతూ వస్తున్న బహుళత్వంలో ఏకత్వం... భిన్నత్వంలో ఏకత్వాలే భారత్‌ను నడిపిస్తున్నాయి.
2)సామాజిక ఇంజినీరింగ్
ఆది నుంచీ విలక్షణమైన వర్ణ, కుల వ్యవస్థలుగల భారత సమాజం... ఆధునికకాలంలో అనుసరించిన సామాజిక ఇంజినీరింగ్ యావత్ ప్రపంచంలోనే ప్రత్యేకమైంది. వివక్ష, అణచివేత అన్ని దేశాల్లోనూ వివిధ రూపాల్లో ఉన్నా... ఎక్కడా లేనివిధంగా వాటి పర్యవసానాలకు పరిష్కారంగా రిజర్వేషన్ల రూపంలో సమానత్వానికి బాటలు పరిచింది భారత్! సామాజిక అసమానతలను రూపుమాపే క్రమంలో... ప్రపంచంలో కొనసాగుతున్న ఓ ప్రయోగమిది! ఐరోపాలో, అమెరికాలోనూ... బానిసత్వం వందల ఏళ్ళపాటు కొనసాగినా, వివక్షలింకా కొనసాగుతున్నా ఇలాంటి ఏర్పాటు లేదు. రాజ్యాంగ సాక్షిగా... భారత్ మాత్రం ఎవరికీ సాధ్యంకాని ఈ సామాజిక ఇంజినీరింగ్‌ను కొనసాగిస్తోంది. అసమానతలకు అడ్డుకట్ట వేయటానికి ప్రయత్నిస్తోంది. అణగారిన వర్గాలకు అవకాశాలనందిస్తోంది.
3)ప్రజల ఇంగితజ్ఞానం
చదువు తక్కువే కావొచ్చు. అక్షరాసత్యత పూర్తిగా లేకపోవచ్చు. కానీ ఏది మంచి ఏది చెడో తేల్చుకునే తెలివిడి ఈ దేశ ప్రజల బలం! అదే భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసింది. ఓటు వేసి అవకాశం ఇచ్చిన వారు....పాలకులు దారి తప్పితే నేలకేసి కొట్టడానికి వెనుకాడలేదు. ఎదురులేదనుకున్న, అపరశక్తిగా అభివర్ణించిన ఇందిరాగాంధీని సైతం రాజ్‌నారాయణ్ చేతిలో ఓడిపోయేలా చేసిన ఘనత ఈదేశ ప్రజలది. ఏకంగా 400కుపైగా సీట్లిచ్చిన ఈ ప్రజానీకమే... అనుకున్నట్లు పాలించకుంటే రాజీవ్‌గాంధీని ఆ మరుసటి ఎన్నికల్లో దించేసింది! పాలకులు, రాజకీయ నాయకులెంత తమ ఎత్తులుజిత్తుల్లో ఆరితేరినా... ఎన్నికలంటే భయపడుతున్నారంటే కారణం సగటు భారతీయుడి ఇంగితజ్ఞానమే! ఆ బలమే... మన దేశాన్ని పరిణత ప్రజాస్వామ్యంగా తీర్చిదిద్దుతోంది.
4)మహాబజార్...
భారమనుకున్న జనాభాయే భారత్‌కు ఆర్థిక బలం. ఆదిలో ఎలా ఉన్నా... మారుతున్న ఆర్థిక వ్యవస్థలో, ప్రపంచీకరణలో 130 కోట్ల భారత జనాభా... వారి కొనుగోలు శక్తి... మన ఆర్థికానికి వెన్నుదన్నుగా మారింది! ప్రపంచ పరిశ్రమలకూ, వారి అమ్మకాలకూ భారత్ ఓ ఆకర్షణీయమైన మార్కెట్‌గా ఆవిర్భవించింది. 1992లో పీవీ నరసింహారావు హయాంలో వచ్చిన సంస్కరణలు... భారత్‌కు ఆర్థిక స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టాయి. అప్పటిదాకా ఐదులోపున్న భారత వృద్ధిరేటును రెండంకెల దిశగా పరుగులెత్తించాయి. అంతేగాకుండా... లైసెన్స్ రాజ్ రద్దుతో దేశీయంగానూ పారిశ్రామికరంగం ఉరకలెత్తింది. దీనికి తోడు అంతఃపురకాంతలాంటి మన అసంఘటిత రంగం ఆర్థికాన్ని నిలబెడుతోంది. మన ఆర్థికవ్యవస్థలో 80శాతం భాగస్వామ్యం అసంఘటిత రంగానిదే! వ్యవసాయం కూడా కొత్తపుంతలు తొక్కుతోంది. వాతావరణం మనకు ప్రకృతిచ్చిన వరం! చాలా దేశాల్లో మనలా మూడుకాలాలూ, రాత్రీపగలూ సమంగాసాగే అవకాశం ఉండదు.
5)రాజ్యాంగం
ఆనో భద్రా క్రతవో యంతు విశ్వతః....(విశ్వపు అన్ని మూలల నుంచీ గాలి ప్రసరించనీ) అన్నట్లు... ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాల్లోని మంచినంతా రంగరించి రూపొందించిన రాజ్యాంగం భారతదేశాన్ని అంతర్గతంగా బలోపేతం చేసింది. ప్రజల హక్కులను నిలబెడుతూ, వ్యవస్థల్ని కాపాడుతూ ... ఎవరిపై ఎవరు పెత్తనం చేయకుండా... ఒకరి పనితీరును మరొకరు సమీక్షిస్తూ, సహకరిస్తూ... ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పెంచేందుకు అవసరమైన సరంజామా అంతా రాజ్యాంగంలో ఉంది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా సవరణలు చేసుకుంటున్నా... మౌలిక భావనలు అలాగే ఉండి దేశాన్ని నడిపిస్తున్నాయి. పక్కనున్న దాయాది పాకిస్థాన్‌లా ప్రభుత్వం సైన్యం చేతిలో కీలుబొమ్మ కాకుండా... ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా కాపాడుతున్న ఘనత రాజ్యాంగానిదే!
అక్కడ జెండా పండగ 18నస్వాతంత్య్రం వచ్చిన పంద్రాగస్టును యావత్ భారతంలో జరుపుతారనుకుంటాం! స్వాతంత్య్రదినంగా భావిస్తారనుకుంటాం! కానీ కొన్ని ప్రాంతాల్లో స్వాతంత్య్ర దినోత్సవం నేడు కాదు!
భారత్-పాకిస్థాన్‌లను విభజించినప్పుడు... బెంగాల్‌లోని మాల్దా, నాడియా ప్రాంతాలను పాకిస్థాన్ పటంలో చూపించారు. ఇవి రెండూ హిందూ జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలు. రేడియోలో తమ ప్రాంతం పాకిస్థాన్‌లో భాగమని వినటంతో ఆశ్చర్యపోయారు. అప్పటికే తమ జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఆగస్టు 15న పాకిస్థాన్ జెండా ఎగిరింది. దీంతో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ విషయం తెలియటంతో... బౌండరీ కమిషన్ పొరపాటును సవరించింది. ఈ రెండు ప్రాంతాలనూ మళ్ళీ భారత్‌లో భాగం చేసింది. ఆగస్టు 18న ఈ ప్రాంత ప్రజలు త్రివర్ణ పతాకం ఎగరవేసి సంబరాలు చేసుకున్నారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఇచ్చిన అనుమతితో... ప్రతి ఏటా ఇక్కడి ప్రజలు ఆగస్టు 18నే స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకుంటున్నారు.
ప్రజా పాలపుంత...
అలాగని అంతా అద్బుతంగా ఉందనికాదు... భువిపై ఇది స్వర్గమనీ కాదు. అగ్రదేశాల మాదిరిగానే... పేదరికాన్ని జయించేందుకువివక్షను అంతమొందించేందుకు నిరుద్యోగాన్ని నీరుగార్చేందుకు ఇంకా చేయాల్సింది చాలానే ఉంది.
భారత్ తర్వాత స్వాతంత్య్రం వచ్చి... భారత్‌కంటే వేగంగా దూసుకుపోతున్న దేశాలు లేకపోలేదు. కానీ.. భారత్‌లోని ‘పరిస్థితులు’, భారత్ ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న సమస్యల్ని మరేదైనా దేశం తట్టుకొని ఉంటే ఇలా ఎదిగేదా? అంటే సమాధానం చెప్పటం కష్టమే!అందుకే చాలా దేశాలకు భారత్ ఓ అర్థంగాని ప్రహేళిక! కొంతమందికిదో గందరగోళం! కానీ... కచ్చితంగా స్వతంత్య్ర భారతావని ఈ శతాబ్దపు ప్రజాస్వామ్య వింత... అరుదైన ప్రజాపాలపుంత!!!
ఒకే రాకెట్ (పీఎస్‌ఎల్‌వీ-సి37) ద్వారా ఏకంగా 104 ఉపగ్రహాలను రోదసిలోకి పంపిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.
జనరిక్ ఔషధాల ఉత్పత్తిలో ప్రపంచంలో మనమే నం.1
చంద్రుడిపై నీటి జాడను తొలిసారిగా కనుగొంది మన చంద్రయాన్-1 ఉపగ్రహమే. అమెరికా, రష్యా తదితర దేశాలుఅంతకు ముందు ఉపగ్రహాలు, ల్యాండర్లు పంపినప్పటికీ అవేవీ నీటి ఉనికిని గుర్తించలేకపోయాయి.
హీరో మోటార్స్ ప్రపంచంలో అత్యధిక ద్విచక్ర వాహనాలు ఉత్పత్తి చేస్తున్న సంస్థ
సుగంధ ద్రవ్యాల వినియోగం, ఎగుమతుల్లో మనమే ప్రపంచంలో నంబర్‌వన్
తొలిప్రయత్నంలోనే అంగారకుడి కక్ష్యలోకి విజయవంతంగా ఉపగ్రహం (మంగళయాన్) ప్రవేశపెట్టిన ఏకైక దేశం భారతే
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.