కేంద్రానికి ఆ అధికారం ఉంది

రాష్ట్రాల పరిపాలనా ట్రైబ్యునళ్లను రద్దు చేసే కేంద్ర అధికారాలను అడ్డుకునే నిబంధనేదీ రాజ్యాంగంలో లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Updated : 22 Mar 2023 04:56 IST

రాష్ట్రాల పరిపాలనా ట్రైబ్యునళ్లను రద్దు చేయొద్దన్న నిబంధనేదీ రాజ్యాంగంలో లేదు: సుప్రీంకోర్టు

దిల్లీ: రాష్ట్రాల పరిపాలనా ట్రైబ్యునళ్లను రద్దు చేసే కేంద్ర అధికారాలను అడ్డుకునే నిబంధనేదీ రాజ్యాంగంలో లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒడిశా పరిపాలనా ట్రైబ్యునల్‌ను రద్దు చేసేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికన్నా ముందే దానిని ప్రజలెవరూ ప్రశ్నించజాలరని పేర్కొంది. పరిపాలనా ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ ఒడిశా తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకునేలా కేంద్రం తన అధికారాలను వినియోగించిందని, ట్రైబ్యునల్‌ ఏర్పాటనేది పరిపాలనాపరమైన నిర్ణయమని, అది న్యాయపరమైన నిర్ణయం కిందకు రాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘రాష్ట్రాల పరిపాలనా ట్రైబ్యునళ్ల ఏర్పాటును కేంద్రం అడ్డుకోవడం నుంచి ఆర్టికల్‌ 323-ఏ రక్షణ కల్పించదు. పరిపాలనా ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాల నుంచి వచ్చే విజ్ఞప్తులను అంగీకరించేందుకు కేంద్రానికి అధికారం ఉంటుంది’ అని 77 పేజీల తీర్పులో ధర్మాసనం పేర్కొంది. 2019 ఆగస్టు 2వ తేదీన ఒడిశా పరిపాలనా ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించడం ఆర్టికల్‌ 14 నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేసింది. సహజ న్యాయ సూత్రాలనూ ఇది ఉల్లంఘించలేదని పేర్కొంది. ఆ నోటిఫికేషన్‌ రాష్ట్రపతి పేరుమీద కాకుండా జారీ చేసి ఉంటే చెల్లుబాటు అయ్యేదని అభిప్రాయపడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు