నేరస్థుల రాజకీయ పార్టీలపై నిషేధం!

నేర నిర్ధారణ జరిగి దోషులుగా తేలిన వ్యక్తులు రాజకీయ పార్టీలను ఏర్పాటు చేయడం కానీ, వాటిని నిర్వహించడం కానీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మే నెల మొదటి వారంలో సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.

Updated : 29 Mar 2023 05:32 IST

ప్రజాప్రయోజన వ్యాజ్యంపై మేలో సుప్రీంకోర్టు విచారణ

దిల్లీ: నేర నిర్ధారణ జరిగి దోషులుగా తేలిన వ్యక్తులు రాజకీయ పార్టీలను ఏర్పాటు చేయడం కానీ, వాటిని నిర్వహించడం కానీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మే నెల మొదటి వారంలో సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. దోషులైన వ్యక్తులు రాజకీయ పార్టీల కార్యనిర్వాహక సభ్యులుగా కూడా ఉండకూడదని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ కేసును ఏప్రిల్‌ 5 లేదా 6న విచారణ జరపాలన్న న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ అభ్యర్థనను మంగళవారం జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నల ధర్మాసనం తోసిపుచ్చింది. ‘ఈ పిటిషన్‌ విచారణకు తొందరేమిటి? మే మొదటి వారంలో విచారణకు వస్తుంద’ని ధర్మాసనం తెలిపింది. దోషులైన రాజకీయ నాయకులకు కొన్నేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండదు. అయినప్పటికీ పార్టీలకు నాయకత్వం వహిస్తూ ప్రజాప్రతినిధులుగా ఎవరు ఎన్నిక కావాలో నిర్ణయిస్తున్నారని అశ్వినీ ఉపాధ్యాయ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అటువంటి వ్యక్తుల నేతృత్వంలో కొనసాగే రాజకీయ పార్టీల నమోదును రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఇవ్వాలని, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని ‘సెక్షన్‌ 29ఎ’ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ 2017లో పిటిషన్‌ దాఖలు చేశారు. హత్యలు, అత్యాచారాలు, మనీలాండరింగ్‌, దోపిడీ, దేశద్రోహం వంటి తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తులు కూడా రాజకీయ పార్టీలను నెలకొల్పి వాటికి నేతృత్వం వహిస్తున్నారని, ఈ పరిస్థితిని కొనసాగనివ్వకుండా తగిన ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని