వీరోచితం.. భర్త కోసం మొసలితో పోరాడిన మగువ

చంబల్‌ నది తీరాన మొసలి నోటికి చిక్కిన భర్తను కాపాడుకునేందుకు వీరోచితంగా పోరాడిన ఓ మహిళ ఉదంతమిది.

Updated : 13 Apr 2023 08:32 IST

చంబల్‌ నది తీరాన మొసలి నోటికి చిక్కిన భర్తను కాపాడుకునేందుకు వీరోచితంగా పోరాడిన ఓ మహిళ ఉదంతమిది. రాజస్థాన్‌ రాష్ట్రంలోని కరౌలీ జిల్లా మండరాయల్‌ సబ్‌ డివిజనులో మంగళవారం ఈ ఘటన జరిగింది. మేకలకు నీళ్లు తాగించేందుకు నది వద్దకు వెళ్లిన బనీసింగ్‌ మీనా (29).. తనకూ దాహంగా ఉండటంతో నీటికి దగ్గరగా వెళ్లి రెండు దోసిళ్లతో నీరు తాగబోయాడు. అంతే.. నీటి మాటు నుంచి ఒక్క ఉదుటున లేచి బనీసింగ్‌పై దాడి చేసిన మొసలి అతడి కాలిని నోట కరచి నీటి లోపలికి లాక్కొని పోయేందుకు ప్రయత్నించింది.

అనూహ్యమైన ఘటనతో బిత్తరపోయిన బనీసింగ్‌ గట్టిగా కేకలు వేశాడు. కాస్త దూరంలో ఉన్న విమలాబాయి భర్త కేకలు విని పరుగున వచ్చింది. అక్కడి పరిస్థితిని చూసి వెంటనే తేరుకొన్న ఆమె.. నదికి దగ్గరగా వెళ్లి చేతిలో ఉన్న కర్రతో మొసలి తలపై పదే పదే బాదింది. కాసేపటికి బనీసింగ్‌ కాలు వదిలేసి మొసలి నీటిలోకి వెళ్లిపోయింది. చుట్టుపక్కల గొర్రెలు మేపుతున్న వారంతా అక్కడికి చేరుకొన్నారు. తీవ్రంగా గాయపడిన బనీసింగ్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ‘‘కళ్ల ముందు మృత్యువు కనిపించింది. నా భార్య తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడింది’’ అని బనీసింగ్‌ తెలిపాడు. మృత్యువుతో పోరాడుతున్నట్లు తెలుసని, ఆ క్షణంలో తన భర్తను కాపాడుకోవడం ఒక్కటే లక్ష్యం కావడంతో భయం వేయలేదని విమల తెలిపింది. ఈ ఉదంతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో విమల సాహసంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని