Patna: దొంగల భరతం పట్టిన ఎంపీ

ఓ ఎంపీ ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరిచేసి.. పారిపోతున్న వారిని సినిమా లెవెల్‌లో ఎనిమిది కిలోమీటర్లు చేధించి మరీ తన సిబ్బంది సాయంతో బంధించారు.

Published : 06 May 2023 08:42 IST

పట్నా: ఓ ఎంపీ ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరిచేసి.. పారిపోతున్న వారిని సినిమా లెవెల్‌లో ఎనిమిది కిలోమీటర్లు చేధించి మరీ తన సిబ్బంది సాయంతో బంధించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ సాహసం చేసింది ఔరంగాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు సుశీల్‌ కుమార్‌ సింగ్‌. శుక్రవారం మధ్యాహ్నం.. బరున్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. సిరిస్‌ గ్రామానికి చెందిన సరిత కుమారి అనే మహిళ..అనారోగ్యంతో బాధపడుతున్న తన అత్తను చూసేందుకు జముహర్‌ మెడికల్‌ కాలేజీకి వెళ్లింది. అనంతరం బైక్‌పై తన భర్త రాజేష్‌ గుప్తాతో కలిసి తిరిగి వస్తోంది. ఆ సందర్భంలోనే ముగ్గురు దొంగలు సరిత మెడలో ఉన్న చైన్‌ను లాక్కుని పారిపోయారు. అదే సమయంలో కారులో అటుగా వెళ్తున్న ఎంపీ సుశీల్‌ కుమార్‌ సింగ్‌ చూసి.. వెంటనే దొంగలు పారిపోతున్న వైపుగా వెళ్లమని డ్రైవర్‌కు సూచించారు. అలా చాలా సేపు వారిని వెంబడించారు. ఎంపీ కారు దొంగలకు దగ్గరగా వెళ్లగానే.. వారు సుశీల్‌ కుమార్‌ సింగ్‌కు గన్‌ గురిపెట్టి కాల్చేస్తామని బెదిరించారు. అయినా సుశీల్‌ కుమార్‌ ఏ మాత్రం బెదరలేదు. ఆ దొంగలను విడిచిపెట్టకుండా.. వారిని అలాగే వెంబడించారు. చివరకు మధుపుర్‌ అనే గ్రామ సమీపానికి వెళ్లిన దొంగలు.. బైక్‌ బురదలో కూరుకుపోవడం వల్ల కిందపడ్డారు. ఆ వెంటనే ఎంపీ కారు ఆపారు. అది చూసిన ముగ్గురు దొంగలు వెంటనే లేచి పక్కనే ఉన్న పొలాల వైపు పరిగెత్తారు. దీంతో అప్రమత్తమైన ఎంపీ బాడీగార్డ్‌లు.. వారిని వెంబడిస్తూ పరిగెత్తారు. అనంతరం అరకిలోమీటర్‌ వరకు ఛేదించి దొంగలను పట్టుకున్నారు. నిందితులను టింకు కుమార్‌, ఆనంద్‌ కుమార్‌, ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు. అరెస్టయిన వారి నుంచి ఒక విదేశీ అధునాతన పిస్తోలు, ఒక దేశీయ చేతి తుపాకీ, ఏడు లైవ్‌ కాట్రిడ్జ్‌లు, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని