జంతర్‌మంతర్‌ వద్దే దీక్ష

జంతర్‌మంతర్‌వద్ద ఆందోళన చేసుకునేందుకు రెజ్లర్లకు అనుమతివ్వాలని, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ, రెజ్లర్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా డిమాండు చేసింది.

Updated : 02 Jun 2023 05:14 IST

అక్కడే అనుమతించాలి
బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలి
సంయుక్త కిసాన్‌ మోర్చా డిమాండ్‌

దిల్లీ: జంతర్‌మంతర్‌వద్ద ఆందోళన చేసుకునేందుకు రెజ్లర్లకు అనుమతివ్వాలని, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ, రెజ్లర్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా డిమాండు చేసింది. రెజ్లర్లకు మద్దతుగా గురువారం దేశవ్యాప్తంగా మోర్చా ఆందోళనలు నిర్వహించింది. ఈ సందర్భంగా మెమోరాండాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపింది. జంతర్‌మంతర్‌లో ఆందోళనకు అనుమతించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమెను కోరింది. భారత పుత్రికల గౌరవాన్ని కాపాడాలని, నెల రోజులుగా సాగుతున్న ఆందోళనకు త్వరగా ముగింపు పలకాలని విజ్ఞప్తి చేసింది. బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేసి విచారించాలని, తద్వారా ఛార్జిషీట్‌ను త్వరగా కోర్టులో నివేదించవచ్చని సూచించింది. దిల్లీ, పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్‌ తదితర ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. పంజాబ్‌, హరియాణాల్లో ఆందోళనకారులు డిప్యూటీ కమిషనర్లు, సబ్‌ డివిజన్‌ మేజిస్ట్రేట్‌లకు వినతి పత్రాలను అందించారు. బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని కోరారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (లఖోవాల్‌), భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఏక్తా ఉగ్రహన్‌) తదితర 30 సంఘాలు 16 చోట్ల నిరసన ర్యాలీలు నిర్వహించాయి. చండీగఢ్‌లో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు ర్యాలీ జరిపారు.

* రెజ్లర్లకు మద్దతుగా సంయుక్త కిసాన్‌ మోర్చా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దిల్లీ సరిహద్దుల్లో గురువారం భద్రతను కట్టుదిట్టం చేశారు. మరిన్ని పికెట్లు ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. పొరుగు రాష్ట్రాల నుంచి దిల్లీకి వచ్చిన వాహనాలను తనిఖీ చేశాకే పంపించారు.

* క్రీడా ప్రదేశాల్లో మహిళా క్రీడాకారుల భద్రతకు సంబంధించిన అంశంపై చర్చించనందుకు నిరసనగా తృణమూల్‌ ఎంపీలు పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడలపై ఏర్పాటైన స్థాయీ సంఘం సమావేశం గురువారం దిల్లీలో జరిగింది. అందులో మహిళా క్రీడాకారుల భద్రతపై చర్చించాలని తృణమూల్‌ ఎంపీలు దేవ్‌, అసిత్‌ కుమార్‌ పట్టుబట్టారు. అయితే ఎజెండాలో లేనందున చర్చించలేమని ఛైర్మన్‌ స్పష్టం చేశారు. దీంతో వారు వాకౌట్‌ చేశారు.

* రెజ్లర్లకు న్యాయం జరిగేవరకూ పోరాడతామని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. బుధవారం కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించిన ఆమె గురువారమూ వీధుల్లోకి వచ్చారు. కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఆందోళనను ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించొద్దని రెజ్లర్లకు సూచించారు.

* రెజ్లర్ల అంశాన్ని హరియాణా ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత భూపేందర్‌ సింగ్‌ హుడా డిమాండు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించవద్దని హితవు పలికారు.

* మహిళల ఫిర్యాదులను వెంటనే పరిగణనలోకి తీసుకోవాలని, ఆ తర్వాత అధికారులు విచారణ జరిపి నిజానిజాలను నిగ్గు తేలుస్తారని భాజపా ఎంపీ ప్రీతం ముండే అభిప్రాయపడ్డారు. రెజ్లర్ల కేసులో చర్యలు ఉంటాయని భావిస్తున్నానని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని బీడ్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు.


జాగ్రత్తగా చూస్తున్నాం: ఠాకుర్‌

రెజ్లర్ల అంశాన్ని జాగ్రత్తగా చూస్తున్నామని, వారు డిమాండు చేసినట్లుగా విచారణకు కమిటీని నియమించామని కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ తెలిపారు. వారి ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని గురువారం ముంబయిలో చెప్పారు.


రెజ్లర్ల డిమాండ్లు మారుతున్నాయ్‌: బ్రిజ్‌ భూషణ్‌

గోండా: ఆందోళన మొదలైనప్పటి నుంచి రెజ్లర్ల డిమాండ్లు మారుతూ వస్తున్నాయని బ్రిజ్‌ భూషణ్‌ వ్యాఖ్యానించారు. ‘పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దానిని పూర్తి చేయనివ్వండి. అందులో ఏం తేలినా నేను కట్టుబడి ఉంటా’ అని ఆయన గురువారం యూపీలోని గోండాలో పేర్కొన్నారు. అనవసర ప్రశ్నలు అడగొద్దని ఆయన విలేకరులకు చేతులెత్తి నమస్కరించారు. రెజ్లర్ల ఆరోపణలు నిజమని తేలితే ఉరేసుకోవడానికైనా సిద్ధమేనని మరోసారి స్పష్టం చేశారు.


రాష్ట్రపతిని కలుస్తాం: టికాయిత్‌

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ముజఫర్‌పుర్‌లో గురువారం ఖాప్‌ పంచాయతీ జరిగింది. బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతిని కలవాలని అందులో రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఖాప్‌ పంచాయతీ జరిగిందని, శుక్రవారం కురుక్షేత్రలో మరోసారి సమావేశమవుతున్నామని, కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోకుంటే తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని రైతు నేత టికాయిత్‌ తెలిపారు. రెజ్లర్లకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు