Nipah virus: కొవిడ్‌ కంటే నిఫా ప్రమాదకరం

కొవిడ్‌తో పోల్చితే నిఫా వైరస్‌ అత్యంత ప్రమాదకరమైనదని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) హెచ్చరించింది.

Updated : 16 Sep 2023 07:24 IST

 40 - 70 % మరణాలకు అవకాశం
 ఆస్ట్రేలియా నుంచి మందులు: ఐసీఎంఆర్‌

దిల్లీ, కోజికోడ్‌: కొవిడ్‌తో పోల్చితే నిఫా వైరస్‌ అత్యంత ప్రమాదకరమైనదని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) హెచ్చరించింది. కొవిడ్‌ కేసుల్లో మరణాలు 2 - 3 శాతం మాత్రమే ఉండగా.. నిఫా వైరస్‌ వల్ల 40 - 70 శాతం ఉంటాయని పేర్కొంది. కేరళలో ఈ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో ఇంకా తెలియలేదని, నిఫా వ్యాప్తిని అడ్డుకునేందుకు తగు చర్యలు తీసుకొంటున్నామని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌ శుక్రవారం తెలిపారు. ‘‘ఐసీఎంఆర్‌ వద్ద ప్రస్తుతం 10 మంది రోగులకు సరిపడా మోనోక్లీనల్‌ యాంటీబాడీ మందు ఉంది. మరో 20 డోసుల మందును ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేస్తాం. భారత్‌లో ఇప్పటివరకు నిఫా వైరస్‌ రోగుల్లో ఒక్కరికి కూడా మోనోక్లీనల్‌ యాంటీబాడీల మందు ఇవ్వలేదు. ఇన్ఫెక్షను ప్రారంభ దశలో ఉన్నపుడే ఈ మందు వాడాలి. నిఫా వైరస్‌ గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించినట్లు 2018లో వెల్లడైంది. కానీ, ఈ వ్యాధి గబ్బిలాల నుంచి ఎలా వ్యాప్తి చెందుతుందో కచ్చితంగా చెప్పలేం’’ అని చెప్పారు. ఇప్పటివరకు విదేశాల్లో ఉన్న 14 మంది నిఫా రోగులకు మోనోక్లోనల్‌ యాంటీబాడీ మందును ఇచ్చారని.. వారంతా సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. 

వర్షాకాలంలో వ్యాప్తి..

నిఫా వైరస్‌ వర్షాకాలంలోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌ చెప్పారు. దీన్ని అరికట్టేందుకు చేతులు శుభ్రం చేసుకొంటూ, మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలని కోరారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యమంత్రి వీణా జార్జ్‌ సూచించారు. 

కోజికోడ్‌లో మరొకరికి నిఫా..

కేరళలో నిఫా వైరస్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా కోజికోడ్‌లో 39 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధరించారు. ఆగస్టు 30న నిఫా వైరస్‌తో చనిపోయిన వ్యక్తికి సన్నిహితంగా ఉండటం వల్లే ఇతనికి కూడా పాజిటివ్‌ వచ్చినట్లు వీణా జార్జ్‌ వెల్లడించారు. ఈ వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రి పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. తాజా కేసు నమోదుతో కోజికోడ్‌లో నిఫా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. వీరిలో ఇప్పటికే ఇద్దరు మృతిచెందగా.. యాక్టివ్‌ కేసుల సంఖ్య నాలుగుగా ఉంది. కోజికోడ్‌ జిల్లా యంత్రాంగం శనివారం కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. నిఫా వ్యాప్తి నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు కూడా అప్రమత్తమయ్యాయి. వైరస్‌ కట్టడికి పరీక్షల పెంపు ద్వారా అన్ని చర్యలు తీసుకొంటున్నామని వీణా జార్జ్‌ తెలిపారు. కేరళ మొత్తం ఇలాంటి ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఐసీఎంఆర్‌ అధ్యయనాల్లో వెల్లడైందని చెప్పారు.

  • మరోవైపు కోజికోడ్‌ చేరుకున్న కేంద్ర నిపుణుల బృందం నిఫా వైరస్‌పై అధ్యయనం జరుపుతోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని