vaccination for children: మార్చి 16 నుంచి.. 12 - 14 ఏళ్ల వారికి కరోనా టీకా..

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని మరింత విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16, బుధవారం నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు  టీకా పంపిణీని

Updated : 14 Mar 2022 15:37 IST

ఈ వయసు వారికి కార్బెవాక్స్‌ టీకా పంపిణీ 

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని మరింత విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16, బుధవారం నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు టీకా పంపిణీని ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. దీంతో పాటు ఇకపై 60ఏళ్లు పైబడిన అందరికీ ప్రికాషనరీ డోసు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. 

12-14 ఏళ్ల వారికి టీకా పంపిణీని ప్రారంభించేందుకు నేషనల్‌ టెక్నికల్‌ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ ఇప్పటికే కేంద్రానికి సిఫార్సులు చేసింది. ఈ ప్రతిపాదనను అంగీకరించిన కేంద్రం.. బుధవారం నుంచి 12-14 ఏళ్ల వారికి టీకా పంపిణీని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. బయోలాజికల్ ఇ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్‌ టీకాను ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి టీకా పంపిణీని కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వయసు వారికి వ్యాక్సినేషన్‌ దాదాపు పూర్తయిన నేపథ్యంలో 12-14 ఏళ్ల వారిపై కేంద్రం దృష్టిపెట్టింది. 

ఇక, ప్రికాషన్‌ డోసులో ‘ఇతర అనారోగ్య సమస్య’ల క్లాజ్‌ను తొలగించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. మార్చి 16వ తేదీ నుంచి 60ఏళ్లు పైబడిన అందరికీ ప్రికాషనరీ డోసు ఇవ్వనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జనవరి 10 నుంచి ఫ్రంట్‌లైన్‌ వర్కర్లతో పాటు 60ఏళ్లు పైబడిన ఇతర అనారోగ్య సమస్యలున్న వృద్ధులకు కేంద్రం ప్రికాషనరీ డోసును పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. 

కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 180.19కోట్ల టీకా డోసులను పంపిణీ చేశారు. 15-18 వయసు వారిలో 5.58కోట్ల మంది తొలి డోసు తీసుకోగా.. 3.38కోట్ల మందికి రెండు డోసులు అందించారు. 60ఏళ్లు పైబడిన వారిలో 1.03కోట్ల మంది ప్రికాషనరీ డోసు తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని