
Maharashtra: గవర్నర్‌ను నియమించింది అందుకు కాదు.. సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు
ముంబయి: అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక గవర్నర్ భగవత్ సింగ్ కోషియారి మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. మంగళవారం గవర్నర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాసనసభా హక్కులు, ప్రభుత్వ సిఫార్సులు, ప్రజల అభీష్టాన్ని తిరస్కరించేందుకు గవర్నర్‌ను నియమించలేదన్నారు. గవర్నర్ బాగా చదువరిలా కనిపిస్తున్నారని, ఇది ఆయనకు అజీర్తి కలిగించొచ్చంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఎవరికైనా అజీర్తి చేస్తే కడుపునొప్పి వస్తుంది.. అలాంటి జబ్బులకు రాష్ట్ర ఆరోగ్యశాఖ చికిత్స చేయగలదని దెప్పిపొడిచారు!
‘గవర్నర్ తన రాజ్యాంగ విధులకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. రాష్ట్రం కూడా కొన్ని రాజకీయ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’ అని రౌత్ అన్నారు. స్పీకర్ ఎన్నిక విషయంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే పంపిన లేఖకు సంబంధించి గవర్నర్ స్పందనపై తాను మాట్లాడబోనని తెలిపారు. ఇదిలా ఉండగా.. రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలకు మంగళవారమే చివరి రోజు. దీంతో స్పీకర్ ఎన్నికకు అనుమతి ఇవ్వడంలో ఆలస్యాన్నే అంగీకారంగా భావించి, నేడు ఈ ప్రక్రియ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోషియారికి సోమవారమే తెలిపిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.