Lok sabha: కొత్త రాష్ట్రాల ప్రతిపాదనల్లేవ్‌.. మూడేళ్లలో 348 కస్టడీ మరణాలు!

కొత్త రాష్ట్రాలు ఏర్పాటుకు  సంబంధించిన ప్రతిపాదనలేవీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేవని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. కొందరు వ్యక్తులు, సంస్థల నుంచి.......

Updated : 03 Aug 2021 16:40 IST

లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర హోంశాఖ

దిల్లీ: కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు  సంబంధించిన ప్రతిపాదనలేవీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేవని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. కొందరు వ్యక్తులు, సంస్థల నుంచి అలాంటి డిమాండ్లును ఎప్పటికప్పుడు స్వీకరించినప్పటికీ  రాష్ట్రాలను విభజించే ప్రతిపాదనలేవీ కేంద్రం వద్ద లేవని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ లోక్‌సభలో వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రాన్నైనా విభజించే ప్రతిపాదన కేంద్రం వద్ద ఉందా అని పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పలువురు వ్యక్తులు, సంస్థల నుంచి డిమాండ్లు, అభ్యర్థనలూ ఎప్పటికప్పుడు స్వీకరిస్తున్నట్టు చెప్పారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు మన దేశ సమాఖ్య రాజకీయాలపై విస్తృతమైన ప్రభావం చూపుతుందన్నారు. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కేంద్ర ప్రభుత్వం కొత్త రాష్ట్రాల ఏర్పాటు అంశంలో ముందుకు వెళ్తుందన్నారు. ఇప్పటికైతే అలాంటి ప్రతిపాదనలేవీ కేంద్రం వద్ద లేవని మంత్రి స్పష్టంచేశారు.

మూడేళ్లలో 348 కస్టడీ మరణాలు
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గత మూడేళ్లలో 348 మంది పోలీస్‌ కస్టడీలో మృతి చెందినట్టు కేంద్రం వెల్లడించింది. అలాగే, పలు కేసుల్లో నిర్బంధించడం ద్వారా 1189 మంది హింసకు గురైనట్టు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ లోక్‌సభకు వెల్లడించారు. జాతీయ మానవహక్కుల కమిషన్‌ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2018లో 136మంది పోలీస్‌ కస్టడీలో మృతిచెందగా.. 2019లో 112 మంది, 2020లో 100 మంది ప్రాణాలు విడిచినట్టు పేర్కొన్నారు.  అలాగే, పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురైన వారిలో 2018లో 542మంది ఉండగా.. 2019లో 411మంది, 2020లో 236మంది ఉన్నట్టు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని