వచ్చింది ఒకే ఒక్క ఓటు.. ఆ అభ్యర్థికి ఇంట్లోవాళ్లూ ఓటేయలేదు..!

సాధారణంగా ఇంట్లో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఆ వ్యక్తి తరఫున కుటుంబసభ్యులంతా ప్రచారంలోకి దిగుతారు. ‘మీ ఓటు మాకే వేయండి’ అంటూ ఓటర్లను అభ్యర్థిస్తుంటారు.

Updated : 22 Dec 2021 11:18 IST

గాంధీనగర్‌: సాధారణంగా ఇంట్లో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఆ వ్యక్తి తరఫున కుటుంబసభ్యులంతా ప్రచారంలోకి దిగుతారు. ‘మీ ఓటు మాకే వేయండి’ అంటూ ఓటర్లను అభ్యర్థిస్తుంటారు. ఇక, ఇంట్లో వాళ్ల ఓట్లు కూడా ఆ వ్యక్తికే పడటం సర్వసాధారణమే. కానీ గుజరాత్‌ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. బయటివారిని ఓట్ల అడగటం పక్కనబెట్టండి.. కనీసం పోటీ చేసిన అభ్యర్థికి.. ఇంట్లో వాళ్లే ఒక్క ఓటు కూడా వేయలేదు. కుటుంబంలోనే 12 మంది ఓటర్లున్నా.. ఆ అభ్యర్థికి మొత్తంగా కేవలం ఒక్క ఓటు పడింది. అదీ ఆయనదే కావడం గమనార్హం. ఈ విచిత్ర ఘటన వాపి జిల్లాలో చోటుచేసుకుంది.

గుజరాత్‌లో ఇటీవల దశల వారీగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. వాపీ జిల్లాలోని ఛార్వాలా గ్రామంలో సర్పంచి పదవికి సంతోష్‌ అనే వ్యక్తి నామినేషన్‌ వేశారు. ఆయన కుటుంబంలో మొత్తం 12 మంది ఓటర్లున్నారు. సర్పంచి ఎన్నికల పోటీలో సంతోష్‌ ప్రధాన అభ్యర్థి కాకపోయినప్పటికీ.. కనీసం తన కుటుంబసభ్యుల ఓట్లయినా వస్తాయని భావించారు. ఎన్నికల అనంతరం కౌటింగ్‌ చేపట్టగా.. సంతోష్‌కు కేవలం ఒకే ఒక్క ఓటు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆయన ఒక్కసారిగా కంగుతిన్నాడు. అయితే ఆ వచ్చిన ఓటు కూడా ఆయన వేసుకున్నదేనట. కనీసం కుటుంబసభ్యులు తనకు ఓటు వేయకపోవడంతో పోలింగ్‌ కేంద్రం వద్దే ఆ అభ్యర్థి కన్నీళ్లు పెట్టుకున్నారు. 

గుజరాత్‌ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఫలితాలను ప్రకటించగా.. మరికొన్ని చోట్ల లెక్కింపు చేపడుతున్నారు. గురువారం నాటికి పూర్తి ఫలితాలను వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని