Surprise: ఉద్యోగులకు సర్‌ప్రైజ్‌.. కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన యజమాని!

ఉద్యోగులకు ఓ ఫార్మా కంపెనీ యజమాని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఏకంగా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వడంతో ఆ ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేవు.

Published : 04 Nov 2023 01:48 IST

చండీగఢ్‌: పండుగల సందర్భాల్లో కంపెనీలు (Employees) ఒకట్రెండు నెలల జీతం బోనస్‌గా ఇస్తేనే ఆ ఉద్యోగులు ఎంతగానో సంబరపడతారు. మరి అలాంటింది ఊహించని గిఫ్ట్‌ వస్తే.. ఆ ఉద్యోగులు ఎగిరి గెంతేస్తారు కదా! ప్రస్తుతం అలాంటి మధురానుభూతినే ఎంజాయ్‌ చేస్తున్నారు హరియాణాలోని ఓ ఫార్మా కంపెనీలో పని చేసే కొందరు ఉద్యోగులు. హరియాణాలోని పంచకులలోని మిట్స్‌ హెల్త్‌ కేర్‌ ఫార్మా సంస్థ డైరెక్టర్‌ ఎంకే భాటియా తన ఉద్యోగులకు టాటా పంచ్‌ కార్లను కానుకగా అందజేశారు. కంపెనీలో ఉద్యోగుల్ని సెలబ్రిటీలుగా పేర్కొన్న ఆయన.. మంచి పనితీరు కనబరిచిన 12మందికి కార్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. వీరంతా కేవలం ఉద్యోగులే కాదు.. సెలబ్రిటీలు అన్నారు. భవిష్యత్తులో మరికొందరికి కార్లను బహుమతిగా ఇస్తానని బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. అయితే, టాటా పంచ్‌ కార్లను గిఫ్ట్‌గా పొందిన వారి జాబితాలో ఆఫీస్‌ బాయ్‌ కూడా ఉండటం విశేషం. 

తన కంపెనీ విజయంలో ఉద్యోగులదే కీలక పాత్ర అని.. వారంతా కఠోర శ్రమ, అంకితభావం, విధేయతతో పనిచేసి కంపెనీ ఎదుగుదలకు సహకరించారని ప్రశంసించారు. కార్లను గిఫ్ట్‌గా పొందినవారిలో కొందరు కంపెనీ ప్రారంభించినప్పటి ఆయన వెంటే ఉన్నారు. ఈ కార్లు కేవలం దీపావళి కానుకలు కాదని.. కంపెనీపై తన ఉద్యోగులు చూపించిన నిబద్ధత, విశ్వాసానికి బహుమతులని భాటియా పేర్కొన్నారు. అయితే, ఈ కార్లను గిఫ్ట్‌లుగా పొందిన వారిలో కొందరు ఉద్యోగులకు అసలు కారు ఎలా నడపాలో కూడా తెలియకపోవడం గమనార్హం. కలలో కూడా తాము ఊహించని గిఫ్ట్‌ను తమ బాస్‌ ఇవ్వడంతో కొందరు ఉద్యోగులు అవాక్కయ్యారట!

ఈ సందర్భంగా భాటియా మీడియాతో మాట్లాడారు. ‘ఉద్యోగులు తమను తాము సెలబ్రిటీగా ప్రత్యేకంగా ఫీల్‌ అవ్వాలని నేను కోరుకున్నా. సానుకూల ఆలోచన వల్లే ఇది జరిగింది, నా కంపెనీ ఎన్నో ఎత్తుపల్లాలను చూసిందని.. కానీ ఈ ఉద్యోగులంతా నా వెంటే ఉండి కంపెనీ ఎదుగుదలకు సహకరించారు. వాళ్లే మా స్టార్‌లు’’ అని కొనియాడారు. ఈ కార్లను నెల రోజుల క్రితమే ఆయన ఉద్యోగులకు అందజేసి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. అయితే, ఈ వార్త ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. దీపావళి సందర్భంలో ఇలాంటి వార్తలు రావడం యాదృచ్ఛికమేనని.. కాకపోతే దీని గురించి తాను ప్లాన్‌ చేయలేదని చెప్పారు. భవిష్యత్తులో కార్లు ఇచ్చే సంఖ్యను 12 నుంచి 50కి పెంచే ఆలోచన ఉందన్నారు. ఇక కారు విషయానికి వస్తే.. గిఫ్ట్‌గా ఇచ్చిన టాటా పంచ్‌ కారు 2021లో విడుదలైంది. దీని రేంజ్‌ రూ.6లక్షల నుంచి మొదలవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని