
Nagaland: నాగాలాండ్ ఘటనపై నేడు పార్లమెంట్‌లో అమిత్ షా ప్రకటన
దిల్లీ: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో సామాన్య పౌరులపై చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభలో, ఆ తర్వాత గంటకు రాజ్యసభలో అమిత్ షా దీనిపై మాట్లాడనున్నట్లు పార్లమెంటరీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. నాగాలాండ్ ఘటనపై చర్చ కోసం ఇప్పటికే పలు ప్రతిపక్ష ఎంపీలు ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. నేటి సమావేశాల్లో విపక్షాలు దీనిపై ఆందోళన చేపట్టనున్నాయి.
ఆర్మీ యూనిట్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు..
మరోవైపు పౌరులపై కాల్పులకు పాల్పడ్డ సైన్యానికి చెందిన పారా ప్రత్యేక బలగం ఎలైట్ యూనిట్‌పై నాగాలాండ్ రాష్ట్ర పోలీసులు సుమోటోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బలగాల అనాలోచిత చర్య కారణంగా పౌరులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు ఆరోపించారు. ఆపరేషన్ కోసం రాష్ట్ర పోలీసుల నుంచి ఎలాంటి గైడ్ తీసుకోలేదని తెలిపారు. ఇది పూర్తిగా భద్రతా బలగాల ‘ఉద్దేశపూర్వక హత్య’ అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
నాగాలాండ్‌లోని మయన్మార్ సరిహద్దు మోన్ జిల్లాలో భద్రతా బలగాలు శనివారం జరిపిన కాల్పులు కల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. తిరుగుబాటుదారులుగా పొరబడి సామాన్య కూలీలపై ఎలైట్ యూనిట్ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు బలగాలను చుట్టుముట్టి దాడి చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో ఆత్మరక్షణ కోసం సిబ్బంది మళ్లీ కాల్పులు జరపడంతో మరో ఏడుగురు స్థానికులు మృత్యువాత పడ్డారు. పౌరుల దాడిలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.