IIT Bombay: వెజ్‌-నాన్‌వెజ్ వివాదం.. నిరసన తెలిపిన విద్యార్థికి రూ. 10 వేలు జరిమానా

ఐఐటీ బాంబేలో వెజ్‌-నాన్‌వెజ్‌ వివాదం విషయంలో నిరసన తెలిపిన విద్యార్థులపై చర్యలు చేపట్టాలని ఇనిస్టిట్యూట్ మెస్ కౌన్సిల్ నిర్ణయించింది.

Published : 03 Oct 2023 18:30 IST

ముంబయి: ఐఐటీ బాంబే (IIT Bombay)లో కొద్ది నెలల క్రితం చోటు చేసుకున్న వెజ్‌-నాన్‌వెజ్‌ వివాదం విషయంలో నిరసన తెలిపిన విద్యార్థుల్లో ఒకరికి ఇనిస్టిట్యూట్‌ మెస్‌ కౌన్సిల్ రూ. 10 వేలు జరిమానా విధించింది. దాంతోపాటు నిరసనల్లో పాల్గొన్న ఇతర విద్యార్థులను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. అక్టోబరు 1న సమావేశమైన ఇనిస్టిట్యూట్ మెస్ కౌన్సిల్ వెజ్‌ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా టేబుళ్లను కేటాయించాలని నిర్ణయించింది. అలాగే, గతంలో వెజ్‌ పోస్టర్లకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై చర్యలు చేపట్టాలని తీర్మానించింది. ఇదే విషయాన్ని విద్యార్థులకు ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేసింది. 

‘‘కొద్దిరోజుల క్రితం హాస్టల్‌ 12, 13, 14లోని కొందరు విద్యార్థులు క్యాంపస్‌లో శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేందుకు ప్రయత్నించారు. వారి ప్రవర్తన విద్యార్థి వ్యవహారాల విభాగం అసోసియేట్ డీన్‌ సూచించిన నిబంధనలకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి వాటిని ఇనిస్టిట్యూట్‌ ప్రోత్సహించదు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. భోజన సమయంలో కొందరు నాన్‌-వెజ్‌ వాసనను ఇష్టపడరు. హాస్టల్‌లో ఉండే ప్రతి విద్యార్థికి భోజన సమయంలో అసౌకర్యం కలగకుండా చూడటమే ఇనిస్టిట్యూట్‌ లక్ష్యం. అందుకే మెస్‌లో ఆరు టేబుళ్లను వెజిటేరియన్లకు కేటాయించాలని నిర్ణయించాం. ఇకపై ఆ టేబుళ్లలో వెజ్‌ భోజనం మాత్రమే చేయాలి’’ అని విద్యార్థులకు పంపిన ఈ-మెయిల్‌లో స్పష్టం చేసింది. 

ఈ ఏడాది జులైలో ఐఐటీ బాంబేలో వెజ్‌-నాన్‌వెజ్‌ వివాదం రాజుకుంది. వసతి గృహం క్యాంటీన్‌లో మాంసాహారం తిన్నందుకు ఓ విద్యార్థిని మరో విద్యార్థి అవమానించాడు. మాంసాహారం తినే విద్యార్థులపై క్యాంటీన్‌లో వివక్ష చూపుతున్నారని పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. క్యాంటీన్‌ గోడలపై ‘వెజిటేరియన్లు మాత్రమే ఇక్కడ కూర్చోవడానికి అనుమతిస్తామని’ రాసిన పోస్టర్లను కొందరు విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని