దిల్లీ ఆందోళనలపై ఐరాస స్పందన!

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయంపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. శాంతియుత, అహింసా మార్గంలో చేపట్టే నిరసనలను గౌరవించాలని ఐరాస అభిప్రాయపడింది.

Published : 27 Jan 2021 14:05 IST

దిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఐక్యరాజ్యసమితి స్పందించింది. శాంతియుత, అహింసా మార్గంలో చేపట్టే నిరసనలను గౌరవించాలని ఐరాస అభిప్రాయపడింది. ‘ఈ విషయంపై అనేక సందర్భాల్లో చెప్పినట్లుగా.. శాంతియుత నిరసనలు, స్వేచ్ఛా సమావేశాలు, అహింసా మార్గాలను గౌరవించడం ఎంతో ముఖ్యమని నేను భావిస్తున్నాను’ అని సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గుటెర్రస్‌ అధికార ప్రతినిధి స్టీఫేన్‌ డుజారిక్‌ వెల్లడించారు.

300 మంది పోలీసులకు గాయాలు..

ట్రాక్టర్‌ పరేడ్‌లో భాగంగా దిల్లీలో జరిగిన ఆందోళనల్లో దాదాపు 300మందికి పైగా పోలీసులు గాయపడగా, ఓ వ్యక్తి మరణించినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. ట్రాక్టర్‌ ర్యాలీలో జరిగిన ఘటనలో ఇప్పటి వరకు 22 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని తెలిపారు. అయితే, రైతుల హింసాత్మక ఘటనలకు నిరసనగా పోలీసు కుటుంబాలకు చెందిన దాదాపు 1500మంది బుధవారం ఆదాయపు పన్ను కార్యాలయం కూడలి వద్ద నిరసన  చేపట్టారు. ఇక ట్రాక్టర్‌ పరేడ్‌ తలపెట్టిన రైతు సంఘాలు, ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించడం వల్లే దిల్లీలో హింసాత్మక ఘటనలకు కారణమయ్యిందని దిల్లీ పోలీసులు స్పష్టంచేశారు.

ఇదిలాఉంటే, దిల్లీలో జరిగిన ఘటనలకు తమకు సంబంధం లేదని ఇప్పటికే 41 రైతుల సంఘాల సంయుక్త కిసాన్‌ మోర్చా స్పష్టంచేసింది. ర్యాలీలో భాగంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై చర్చించేందుకు అన్ని రైతు సంఘాలతో నేడు సమావేశం కానున్నట్లు తెలిపింది.

ఇవీ చదవండి..
దిల్లీ అల్లర్లు..‘దీప్‌ సిధు’ పాత్రేంటీ?
ట్రాక్టర్‌ పల్టీ వల్లే రైతు మృతి: దిల్లీ పోలీసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని