Kakadu 2022: ఆస్ట్రేలియా జలాల్లో ‘ఐఎన్‌ఎస్‌ సాత్పురా’ సత్తా!

స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన భారత యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్‌ సాత్పురా(INS Satpura)’.. రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కాకడు- 2022(Kakadu-2022)’ యుద్ధ విన్యాసాల్లో తన శక్తిసామర్థ్యాలను...

Published : 26 Sep 2022 02:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన భారత యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్‌ సాత్పురా(INS Satpura)’.. రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కాకడు- 2022(Kakadu-2022)’ యుద్ధ విన్యాసాల్లో తనదైన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించింది. సముద్రంలో నిర్వహించిన యాంటీ- సబ్‌మెరైన్‌, యాంటీ- షిప్‌ యుద్ధ విన్యాసాల్లో పాల్గొని తన సత్తా చాటుకున్నట్లు నేవీ(Indian Navy) అధికారులు ఆదివారం వెల్లడించారు. గన్ ఫైరింగ్ విన్యాసాల్లో భాగంగా కచ్చితమైన లక్ష్య విధ్వంసక సామర్థ్యాన్నీ తెలియజెప్పిందన్నారు. సముద్ర జలాల్లో మిత్ర దేశాలకు చెందిన నౌకాదళాల మధ్య పరస్పర అవగాహన, సహకారం, నిర్వహణను పెంపొందించడమే లక్ష్యంగా ఈ యుద్ధ విన్యాసాల్లో పాల్గొన్నట్టు అధికారులు పేర్కొన్నారు.

ఆస్ట్రేలియాలోని డార్విన్‌ తీరంలో ‘కాకడు- 2022’ యుద్ధ విన్యాసాలు నిర్వహించారు. ఇందులో 14 దేశాలకు చెందిన నౌకాదళాలు పాల్గొన్నాయి. సెప్టెంబరు 12 నుంచి రెండు వారాలపాటు ఇవి కొనసాగాయి. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ సాత్పురాతోపాటు పీ-8ఐ సముద్రతీర నిఘా విమానం ఈ విన్యాసాల్లో తమ పరాక్రమాన్ని ప్రదర్శించాయి. ఇదిలా ఉండగా ‘ఐఎన్‌ఎస్‌ సాత్పురా’.. స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన ఓ గైడెడ్ మిసైల్‌ స్టెల్త్ ఫ్రిగేట్. బరువు దాదాపు ఆరు వేల టన్నులు. ఈ యుద్ధ నౌక.. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం ఫ్రంట్‌లైన్ యూనిట్‌గా వ్యవహరిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని