
భారత్‌లో.. కరోనా సోకిన తొలివ్యక్తికి రీ-ఇన్ఫెక్షన్!
వెల్లడించిన కేరళ వైద్యాధికారులు
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వెలుగు చూసి ఏడాదిన్నర దాటుతున్నా వైరస్ ఉద్ధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో కొందరికి వైరస్ మళ్లీ సోకుతున్న (Reinfection) దాఖలాలు కనిపిస్తున్నాయి. దేశంలో కరోనా వైరస్ బారినపడిన తొలి వ్యక్తికి మళ్లీ వైరస్ సోకింది. భారత్‌లో కొవిడ్-19 సోకిన తొలి వ్యక్తిగా రికార్డుకెక్కిన కేరళ మహిళ, తాజాగా మరోసారి వైరస్ బారినపడినట్లు అధికారులు వెల్లడించారు.
‘దేశంలో కరోనా వైరస్ సోకిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందిన మహిళ తాజాగా రీ-ఇన్ఫెక్షన్ బారినపడింది. యాంటీజెన్ పరీక్షల్లో నెగటివ్ వచ్చినప్పటికీ ఆర్టీ-పీసీఆర్‌లో మాత్రం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవు’ అని కేరళలోని త్రిస్సూర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కేజే రీనా వెల్లడించారు. ఉన్నత చదువుల కోసం దిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆమె నమూనాలను పరీక్షించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ప్రస్తుతం వారి ఇంటిలోనే ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.
డిసెంబర్ 2019లో చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్.. అనతికాలంలోనే యావత్ ప్రపంచానికి విస్తరించిన విషయం తెలిసిందే. భారత్‌లో మాత్రం జనవరి 30, 2020న తొలి కేసు నమోదయ్యింది. వుహాన్ యూనివర్సిటీలో చదువుతోన్న కేరళకు చెందిన మెడికల్ విద్యార్థిని, సెమిస్టర్ సెలవుల్లో భాగంగా భారత్‌కు వచ్చింది. అనంతరం అస్వస్థతకు గురికావడంతో అధికారులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మూడు వారాలపాటు మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందించిన తర్వాత రెండుసార్లు పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చింది. దీంతో ఆమె పూర్తిగా కోలుకున్నట్లు భావించిన అధికారులు, ఫిబ్రవరి 20, 2020న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. తాజాగా ఆ మహిళ మరోసారి వైరస్ బారినపడింది.
రీ-ఇన్ఫెక్షన్గా ఎప్పుడు పరిగణిస్తారంటే..
భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో రెండోసారి వైరస్ బారినపడే (రీ-ఇన్ఫెక్షన్) కేసులు కూడా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, కరోనా రీ-ఇన్ఫెక్షన్పై ప్రపంచ వ్యాప్తంగా ఏకాభిప్రాయం లేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి కనీసం 102 రోజుల వ్యవధిలో రెండోసారి పాజిటివ్ వస్తే దాన్ని రీ-ఇన్ఫెక్షన్గా పరిగణించాలని భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) ఇదివరకే నిర్ణయించింది. అయితే ఈ మధ్యకాలంలో ఒకసారి నెగటివ్ వచ్చి మళ్లీ పాజిటివ్ వస్తేనే దాన్ని రీ-ఇన్ఫెక్షన్గా గుర్తిస్తారు. అమెరికాలో వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) ప్రకారం, ఓ వ్యక్తికి 90 రోజుల అనంతరం మళ్లీ పాజిటివ్ వస్తే, జీనోమ్ సీక్వెన్స్ ద్వారా రీ-ఇన్ఫెక్షన్ను నిర్ధారించాలని సూచిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.