అన్నీ చర్చించే నిర్ణయం తీసుకున్నాం: జావడేకర్‌

ఓటీటీకి సంబంధించి గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని కేంద్ర సమాచార, ప్రసారశాఖ

Published : 26 Feb 2021 19:47 IST

న్యూదిల్లీ: ఓటీటీకి సంబంధించి గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ అన్నారు. శుక్రవారం ఆయన ఓ టెలివిజన్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ..  ప్రతి రంగంలోనూ ప్రభుత్వం ఒక స్థాయి వరకూ నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని, అందుకు అనుగుణంగానే ఓటీటీ విషయంలో మార్గదర్శకాలను విడుదల చేశామని అన్నారు. దేశంలో సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేయకుండా కేంద్రం కట్టుదిట్టమైన నిబంధనలను గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘టెలివిజన్‌లలో ప్రసారమయ్యే కార్యక్రమాలన్నీ నియమ, నిబంధనలకు అనుగుణంగా ప్రసారం అవుతాయి. అదే నిబంధన ఓటీటీల, సామాజిక మాధ్యమాలకు ఎందుకు వర్తించకూడదు’ అని ప్రశ్నించారు. తాజా మార్గదర్శకాలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఓటీటీ సంస్థల నిర్వాహకులతో చర్చించకుండా కేంద్రం తాజా నిర్ణయాలు తీసుకుందన్న వార్తలను ఆయన ఖండించారు. మార్గదర్శకాలు విడుదల చేసేముందు ముంబయిలో అందరితోనూ చర్చించినట్లు తెలిపారు.

తాజాగా ట్విటర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు ఓవర్‌-ది-టాప్‌ (ఓటీటీ) వేదికలకు కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. నిబంధనల్లో భాగంగా ఓటీటీ, డిజిటల్‌ మీడియా వేదికలు తమ వివరాలు వెల్లడించాలని మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ వివరించారు. అయితే రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి కాదని, కేవలం వివరాలు మాత్రమే వెల్లడించాలని తెలిపారు.

* ఓటీటీలూ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. తొలుత ప్రతి సంస్థ భారత్‌లో అంతర్గత ఫిర్యాదుల పరిష్కార అధికారిని నియమించుకోవాలి. ప్రతి ఫిర్యాదును 15 రోజుల్లోపు పరిష్కరించాలి.

* రెండో అంచె కింద ఓటీటీ వేదికలు స్వీయ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఇవి ప్రసారం చేసే వాటిని వీక్షకుల వయసును బట్టి 5 కేటగిరీలుగా - ‘యూ (అందరికీ), యూ/ఏ7+, 13+, 16+, ఏ (పెద్దలకు)’ అని వర్గీకరించాలి. చివరి మూడింటికీ ‘పేరెంటెల్‌ లాక్స్‌’ విధానం అమలు చేయాలి. ‘ఏ’కి సంబంధించి వయసును ధ్రువీకరించిన తర్వాతే చూసే విధానం ఉండాలి.

* సుప్రీంకోర్టు, హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి లేదా స్వతంత్ర వ్యక్తుల నేతృత్వంలో ఆరుగురు సభ్యుల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని సమాచార, ప్రసారశాఖ వద్ద నమోదు చేసుకోవాలి. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఓటీటీ సంస్థలు పాటిస్తున్నాయా? అన్నది ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. ఓటీటీ సంస్థ 15 రోజుల్లో పరిష్కరించని ఫిర్యాదులను ఇది పరిశీలిస్తుంది. ఇలా ఫిర్యాదులను విచారించి తీర్పు వెలువరించినప్పుడు ఒకవేళ సంబంధిత సంస్థది తప్పని తేలితే అందుకు క్షమాపణలు కోరుతూ ఓటీటీ సంస్థలు స్క్రోలింగ్స్‌ వేయాలి.

* ఒక ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగం కూడా ఏర్పాటవుతుంది. స్వీయ నియంత్రణపై సంస్థలు అనుసరించాల్సిన విధివిధానాలను ఇది వెల్లడిస్తుంది. ఫిర్యాదులపై విచారణ కోసం ఇది అంతర్గత కమిటీని ఏర్పాటు చేస్తుంది.

* డిజిటల్‌ మీడియా వేదికలు అసత్యాలు, వదంతులు ప్రసారం చేయడానికి వీల్లేదు. ఇవి స్వీయ నియంత్రణ పాటించాలి. ఇందులో వార్తలు ప్రసారం చేస్తే ‘ప్రెస్‌ కౌన్సిల్‌’ నియమావళిని అనుసరించాలి.

* ఐటీ చట్టం కింద ప్రభుత్వానికి దఖలుపడిన అధికారాలను ఉపయోగించి ఈ మార్గదర్శకాలు నిర్దేశించారు. ఓటీటీ నిబంధనలు సమాచార, ప్రసారశాఖ, సామాజిక మాధ్యమాలకు సంబంధించిన విషయాలను ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని