Vaccine: ఓటేసే చోటే టీకా.. ప్రజల హర్షం! 

కరోనా వైరస్‌ నివారణకు టీకాలే అస్త్రం కావడంతో దిల్లీ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ప్రజల్లో వ్యాక్సినేషన్‌పై అవగాహన పెంచడంతో.......

Published : 09 Jun 2021 16:35 IST

దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ట్వీట్‌ 

దిల్లీ: కరోనా వైరస్‌ నివారణకు టీకాలే అస్త్రం కావడంతో దిల్లీ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ప్రజల్లో వ్యాక్సినేషన్‌పై అవగాహన పెంచడంతో పాటు 45ఏళ్లు పైబడిన వారిని వ్యాక్సినేషన్‌కు మరింతగా ప్రోత్సహించడమే లక్ష్యంగా పోలింగ్‌ బూత్‌ల వద్దే టీకా అందించే వినూత్న కార్యక్రమానికి నిన్న శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. బుధవారం ఈ వ్యాక్సినేషన్‌ కేంద్రాలను దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పరిశీలించారు. తమ ఇంటికి సమీపంలో ఉండే పోలింగ్‌ కేంద్రాల వద్దే వ్యాక్సిన్‌ వేయడంపై ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోందని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. అలాగే, ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడంలో ఎలాంటి సమస్య లేదని, బూత్‌స్థాయి అధికారులు ప్రజల ఇళ్లకు వెళ్లి వ్యాక్సినేషన్‌ స్లాట్‌లు కేటాయిస్తున్నారని కేజ్రీవాల్‌ తెలిపారు.

పోలింగ్‌ కేంద్రాల వద్ద టీకా కార్యక్రమం బల్లిమారన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో నిన్న ప్రారంభమైంది. దీంట్లో భాగంగా బూత్‌స్థాయి అధికారులు ఆయా వార్డుల్లోని ప్రజల వద్దకువెళ్లి వారు వ్యాక్సిన్‌ వేయించుకొనేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే, ప్రజలను పోలింగ్‌ బూత్‌ల వద్దకు తీసుకెళ్లేందుకు వీలుగా ఈ-రిక్షాలను కూడా ఏర్పాటు చేశారు. దిల్లీలో 45 ఏళ్లు దాటిన అందరికీ నాలుగు వారాల్లో వ్యాక్సినేషన్‌ పూర్తి చేయనున్నట్టు ఆప్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని