Arvind Kejriwal: దిల్లీ జల్‌బోర్డు కేసులోనూ.. ఈడీ సమన్లకు కేజ్రీవాల్‌ డుమ్మా

Arvind Kejriwal: దిల్లీ జల్‌బోర్డుకు సంబంధించిన కేసులోనూ ఈడీ విచారణకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ డుమ్మా కొట్టారు.ఆ సమన్లు అక్రమమని ఆరోపించారు.

Updated : 18 Mar 2024 12:03 IST

దిల్లీ: దేశ రాజధానిలోని నీటి మండలి (జల్‌బోర్డు)లో అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే దిల్లీ (Delhi) ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు సమన్లు జారీ చేయగా.. విచారణకు ఆయన గైర్హాజరయ్యారు.

ఈ కేసులో సోమవారం ఈడీ కార్యాలయానికి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని సీఎంకు నిన్న సమన్లు జారీ చేశారు. అయితే, వీటిపై ఆమ్‌ ఆద్మీ పార్టీ స్పందిస్తూ.. నోటీసులు చట్టవ్యతిరేకమని ఆరోపించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని భాజపా దర్యాప్తు సంస్థలతో కేజ్రీవాల్‌ను టార్గెట్‌ చేసిందని దుయ్యబట్టింది. నేటి విచారణకు సీఎం హాజరుకారని వెల్లడించింది.

‘ఆయన మా అమ్మకు ఫోన్‌ చేసి కన్నీటిపర్యంతమయ్యారు’: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

కాగా.. మనీలాండరింగ్‌ చట్టం కింద కేజ్రీవాల్‌కు సమన్లు జారీ అయిన రెండో కేసు ఇది. ఇప్పటికే దిల్లీ మద్యం కేసులో ఆయనపై అభియోగాలు రాగా.. ఈడీ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. అవి న్యాయ విరుద్ధమైనవిగా పేర్కొంటూ విచారణకు సీఎం గైర్హాజరయ్యారు. ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది. దీంతో 21వ తేదీన దర్యాప్తు సంస్థ ఎదుట హాజరుకావాలని ఈడీ ఇటీవల తొమ్మిదోసారి సమన్లు పంపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని