Fuel price: పెట్రోల్‌పై ₹2.41 తగ్గించిన కేరళ ప్రభుత్వం

దేశంలో చమురు, గ్యాస్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం తగ్గించడాన్ని తాము స్వాగతిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం తెలిపింది.....

Published : 21 May 2022 23:53 IST

తిరువనంతపురం: దేశంలో చమురు, గ్యాస్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం తగ్గించిన నేపథ్యంలో కేరళలోని లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన కేరళ సర్కార్‌.. తమ రాష్ట్రంలో చమురు ధరలపై రాష్ట్ర పన్నులను తగ్గించనున్నట్టు ప్రకటించింది. కేంద్రం చమురుపై భారీగా పన్నులు వేసి.. పాక్షికంగానే తగ్గించిందని కేరళ ఆర్థిక మంత్రి కేఎన్‌ బాలగోపాల్‌ అన్నారు. అయినా కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు. కేంద్రం ఎక్సైజ్‌ సుంకాలను తగ్గించడానికి తోడు తమ రాష్ట్రంలోనూ పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర పన్నులు తగ్గిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. లీటరు పెట్రోల్‌పై రూ.2.41, డీజిల్‌పై రూ.1.36ల చొప్పున పన్ను తగ్గించనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

మరోవైపు, దేశంలో ద్రవ్యోల్బణం, పెట్రో ధరల పెరుగులతో సతమతమవుతున్న ప్రజలకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై రూ.8లు, డీజిల్‌పై రూ.6 చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజా తగ్గింపుతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.50లు, డీజిల్‌పై రూ.7 తగ్గే అవకాశం ఉంది. పీఎం ఉజ్వల్‌ యోజన పథకం కింద 9కోట్ల మంది లబ్ధిదారులకు సిలిండర్‌పై రూ.200 రాయితీతో ఊరట కల్పిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని