kerala: దీదీ బాటలోనే విజయన్‌.. ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించేందుకు ఆర్డినెన్స్‌..!

కేరళలో ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే గవర్నర్ అధికారాలను తగ్గించేలా రాష్ట్ర సర్కారు కీలక చర్య చేపట్టేందుకు సిద్ధమైంది. కేరళలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించాలని నిర్ణయించింది.

Updated : 09 Nov 2022 15:11 IST

తిరువనంతపురం: విశ్వవిద్యాలయాల కులపతిగా గవర్నర్‌ను తొలగించి.. ఆ స్థానంలో ఓ విద్యా నిపుణుడిని నియమించేందుకు కేరళలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోంది. దీనిపై త్వరలోనే ఆర్డినెన్స్‌ తీసుకురానున్నట్లు కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌.బిందు తెలిపారు. బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై న్యాయశాఖ తయారు చేసిన ముసాయిదా ఆర్డినెన్స్‌పై నేడు కేబినెట్‌ సమావేశంలో చర్చించారు. అయితే ఈ ఆర్డినెన్స్‌పై రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ సంతకం పెడితేనే అమల్లోకి వస్తుంది. దీంతో ఆయన సంతకం పెడతారా లేదా అన్నదానిపై విద్యాశాఖ మంత్రిని మీడియా ప్రశ్నించగా.. గవర్నర్‌ తన రాజ్యాంగ బాధ్యతలకు అనుగుణంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు బిందు తెలిపారు.

విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకాల విషయంలో పినరయి విజయన్‌ ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కేరళలోని 9 యూనివర్సిటీల ఉప కులపతులు తక్షణమే రాజీనామా చేయాలని ఇటీవల గవర్నర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దానికి వీసీల నుంచి స్పందన రాకపోవడంతో షోకాజ్‌ నోటీసులు సంధించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. వీరి నియామకాలు యూజీసీ నిబంధలనలకు అనుగుణంగా లేవన్నది ఛాన్సలర్‌ హోదాలో ఉన్న గవర్నర్‌ వాదించారు. అయితే గవర్నర్‌ వైఖరిని సీఎం విజయన్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. రాజ్యాంగ పెద్దలు తమ హద్దులు దాటకూడదని పేర్కొన్నారు. వీసీల రాజీనామా వ్యవహారంపై ప్రస్తుతం కేరళ హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది.

కాగా.. ఈ ఏడాది జూన్‌లో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర యూనివర్సిటీల కులపతిగా గవర్నర్‌ను తొలగించి.. ఆ స్థానంలో సీఎంను నియమించేలా ఓ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అయితే ఇంకా అది చట్టరూపం దాల్చలేదు. మరోవైపు కర్ణాటక, తెలంగాణలోనూ పాలక ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని