Ladakh: పర్యావరణానికి హాని చేస్తారా? మారుతీ ప్రకటనపై ఎంపీ ఆగ్రహం!

మారుతీ సుజుకీ (Maruti Suzuki) కంపెనీ కొత్త తీసుకొస్తున్న ఎస్‌యూవీ (SUV) వాహనం వాణిజ్య ప్రటకనను లద్దాఖ్‌ (Ladakh)లో చిత్రీకరించడంపై ఆ ప్రాంత ఎంపీ తప్పుబట్టారు. ప్రకటన కోసం పర్యావరణానికి హాని చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Published : 12 Apr 2023 01:17 IST

లద్దాఖ్‌: వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీలు వాణిజ్య ప్రకటనలు (Commercial Ads) రూపొందిస్తుంటాయి. అలా తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. కంపెనీలు రూపొందించే ప్రకటనలు కొన్ని వినియోగదారులకు చేరువైతే.. మరికొన్ని విమర్శపాలవుతుంటాయి. తాజాగా మారుతీ సుజుకీ (Maruti Suzuki) కంపెనీ చేసిన ఓ యాడ్‌ షూట్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మారుతీ కంపెనీ కొత్తగా తీసుకొస్తున్న జిమ్నీ  (Jimny) అనే ఎస్‌యూవీ (SUV) కారును భారత మార్కెట్లోకి త్వరలో విడుదల చేయనుంది. ఇందులో భాగంగా ఈ కారు కమర్షియల్‌ ప్రకటనను లద్దాఖ్‌ (Ladakh)లోని ఓ నది వద్ద చిత్రీకరించారు. మారుతీ చర్యను లద్దాఖ్‌ ఎంపీ జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్ (Jamyang Tsering Namgyal) తప్పుబట్టారు. 

‘‘ మారుతీ యాడ్‌ షూట్‌ పూర్తిగా బాధ్యతారాహిత్యమైన చర్య. వాణిజ్య ప్రయోజనాల కోసం సున్నితమైన పర్యావరణానికి హాని చేయడం భావ్యం కాదు. స్థానిక అధికారులు వెంటనే ప్రకటన చిత్రీకరణను నిలిపివేయించాలి. అందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తు తరాల కోసం లద్ధాఖ్‌ అందాలను కాపాడుకుందాం’’ అని ట్వీట్‌ చేస్తూ వీడియోను షేర్ చేశారు. 

ఎంపీ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ‘‘లద్దాఖ్‌ పర్యావరణాన్ని కాపాడాలనుకుంటే.. ముందుగా లేహ్‌కు విమానరాకపోకలను నిలిపివేయండి. అలానే, ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్న డీజిల్‌ వాహనాలను ఆపండి. వాటి నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాల వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతోంది. ప్రకటన కోసం అనుమతి ఇచ్చే ముందు అధికారులకు ఈ విషయం తెలియదా?’’ అని ఓ నెటిజన్‌ ట్వీట్ చేశాడు. ‘‘ టూరిజం లేకపోతే.. లద్దాఖ్‌కు గుర్తింపు ఉంటుందా? అక్కడికి వచ్చే పర్యాటకులను బాధ్యతాయుతం వ్యవహరించమని సూచించండి. దాని వల్ల అక్కడి పర్యావరణం ఎంతో మెరుగవుతుంది’’ అని మరో నెటిజన్‌ ఎంపీకి సూచించారు.

ఎంపీ మద్దతుగా మరికొందరు నెటిజన్లు ట్వీట్‌ చేశారు. ‘‘ ఇలాంటి యాడ్ షూట్‌లు నిర్వహించకుండా నిబంధనలున కఠినతరం చేయాలి. ప్రతి పౌరుడు, కంపెనీ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను వహించాలి’’ అని ట్వీట్‌ చేశారు. ఎంపీ ట్వీట్‌పై మారుతీ కంపెనీ స్పందించాల్సి ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని