Arvind Kejriwal: రీట్వీట్ చేసి తప్పు చేశా: పరువునష్టం కేసులో కేజ్రీవాల్‌ క్షమాపణ

ఓ పరువు నష్టం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) నేడు సుప్రీంకోర్టులో విచారణకు హాజరయ్యారు. 

Published : 26 Feb 2024 15:21 IST

దిల్లీ: పరువుకు భంగం కలిగించే వీడియోను రీట్వీట్‌ చేసి తప్పు చేశానని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సోమవారం సుప్రీంకోర్టు(Supreme Court) ఎదుట అంగీకరించారు. ఒక పరువునష్టం కేసు (defamation case)లో తనకు జారీ అయిన సమన్లను దిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంను ఆశ్రయించగా దానిపై నేడు విచారణ జరిగింది. ఈ క్రమంలో ఆయన క్షమాపణలు తెలియజేశారు. ఆప్‌ చీఫ్‌ తన తప్పును అంగీకరించడంతో ఈ కేసును ఇక్కడితో మూసివేయాలనుకుంటున్నారా..? అని కోర్టు ఫిర్యాదుదారుని అడిగింది. అలాగే ఈ కేసులో మార్చి 11 వరకు ట్రయల్‌ కోర్టు ఎలాంటి విచారణ చేపట్టవద్దని ఆదేశించింది. 

యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ 2018 మే నెలలో రూపొందించినట్లు చెబుతున్న ఒక వీడియోను కేజ్రీవాల్‌ తిరిగి ట్వీట్‌ చేసినందుకు క్రిమినల్‌ కేసు దాఖలైంది. ఒకరిని కించపరిచేలా ఉన్న వీడియోను ఇతరులకు పంపడం కూడా పరువునష్టం చట్టం కింద నేరమే అవుతుందని, అలాంటి విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ట్రయల్‌ కోర్టు సమన్లను కొట్టివేయడానికి నిరాకరించింది. దీనిపై కేజ్రీవాల్‌ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదిలా ఉంటే.. జర్మనీలో నివసిస్తున్న రాఠీ 'బీజేపీ ఐటీ సెల్ పార్ట్ II' పేరిట.. తప్పుడు ఆరోపణలు ఉన్న ఈ వీడియోను సర్క్యులేట్ చేశారని ఫిర్యాదుదారు వికాస్‌ సాంకృత్యాయన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని