Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్రే లక్ష్యంగా మాగ్నెటిక్‌ బాంబులు..!

అమర్‌నాథ్‌ యాత్రలో విధ్వంసం సృష్టించాలని పాక్‌ చేసిన యత్నాలను జమ్ముకశ్మీర్‌ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్‌ నుంచి వస్తున్న ఓ క్వాడ్‌కాప్టర్‌లో పాకిస్థాన్‌

Updated : 29 May 2022 17:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమర్‌నాథ్‌ యాత్రలో విధ్వంసం సృష్టించాలని పాక్‌ చేసిన యత్నాలను జమ్ముకశ్మీర్‌ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్‌ నుంచి వస్తున్న ఓ క్వాడ్‌కాప్టర్‌ను కథువాలోని తాల్లీ హరియా చాక్‌  గ్రామం వద్ద పోలీసులు ఆదివారం కూల్చివేశారు. ఆ డ్రోన్‌ నుంచి ఏడు మాగ్నెటిక్‌ బాంబులను, ఏడు యూజీబీఎల్‌ గ్రనేడ్లను స్వాధీనం చేసుకొన్నారు.  

తొలుత డ్రోన్‌ కదలికలను రాజ్‌బాఘ్‌ పోలీసులు ఏర్పాటు చేసిన సెర్చిపార్టీ గుర్తించింది. అది పాకిస్థాన్‌ వైపు నుంచి వస్తున్నట్లు గుర్తించి వెంటనే దానిపై వారు కాల్పులు జరిపారు. అమర్‌నాథ్‌ యాత్రను లక్ష్యంగా చేసుకొని ఈ పేలుడు పదార్థాలను తెచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డ్రోన్‌ తీసుకొచ్చిన మాగ్నెటిక్‌ బాంబులను చార్‌ధామ్‌ యాత్ర బస్సులకు అమర్చేందుకు తెప్పించి ఉంటారని భావిస్తున్నారు. 

ఇది తాలిబన్ల శైలి..!

అమెరికా సేనలు, ఇతర అధికారులను హత్య చేసేందుకు గతంలో తాలిబన్లు మాగ్నెటిక్‌ బాంబులను విరివిగా వాడేవారు. వీరు పేలుడు పదార్థాలకు అయస్కాంతాలు అమర్చి అఫ్గాన్‌ అధికారులు, నాయకుల కార్ల కింద పెట్టేవారు. కాబుల్‌ వంటి పట్టణాల్లో దాడులకు ఇలాంటి వ్యూహాలను అమలు చేసేవారు. ఇవి ఎంత ప్రమాదకరమైనవో తాలిబన్లకు తెలిసినంత మరెవరికీ తెలియదు.

ఏమిటీ మాగ్నెటిక్‌ బాంబ్‌..

అమెరికాతో శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో చేసిన దాడుల్లో వీటినే అత్యధికంగా వినియోగించారు. నిత్యం ఈ బాంబులు అమర్చిన కార్లు ఎక్కడో ఒకచోట పేలుతుండేవి. దీంతో కాబుల్‌ వాసులు వణికిపోయేవారు. ఈ బాంబులను మెకానిక్‌ షెడ్లలో కూడా తయారు చేయవచ్చు. వీటికి 25 డాలర్లకు మించి ఖర్చుకాదు. చిన్న డబ్బాలో పేలుడు పదార్థాలను అమర్చి దానిని సెల్‌ఫోన్‌తో అనుసంధానిస్తారు. దీనికి ఒక అయస్కాంతం అమరుస్తారు. దీనిని ప్రత్యర్థి వాహనం కింద ఇంధన ట్యాంక్‌ సమీపంలో పెట్టి.. బాంబుకు అమర్చిన మొబైల్‌ నంబర్‌కు ఫోన్‌ చేస్తారు. దీంతో భారీ పేలుడు సంభవిస్తుంది. అఫ్గాన్‌ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు 2020, 2021ల్లో డజన్ల కొద్దీ పేలుళ్లకు పాల్పడ్డారు.

కాబుల్‌లో తాలిబన్‌ సానుభూతిపరులు రిపేర్లకు వచ్చిన కార్లలో వీరు మాగ్నెట్‌ బాంబులను పెట్టి పంపించేవారు. సమీ అనే ఉగ్రవాది అక్కడ అరెస్టయ్యే వరకు ఈ విషయం బయటపడలేదు. తాలిబన్లు నయానో భయానో వీరిని లొంగదీసుకొని ఈ పనులు చేయించారు. 

కశ్మీర్‌లో వాడేందుకు పాక్‌ పన్నాగం..

భారత్‌లో 2012లో ఒక ఇరాన్‌ ఉగ్రవాది ఇజ్రాయెల్‌ దౌత్య సిబ్బంది భార్యపై దాడికి తొలిసారి ఈ మాగ్నెట్‌ బాంబ్‌ను వాడారు. కశ్మీర్‌లో కూడా తాలిబన్‌ స్టైల్‌లో ఈ బాంబులను వాడాలని పాక్‌ పన్నాగం పన్నింది.  గతేడాది సాంబ సెక్టార్‌లో భద్రతా దళాలు ఈ మాగ్నెట్‌ బాంబులను స్వాధీనం చేసుకొన్నాయి. వీటిని పాక్‌ ఐఎస్‌ఐ సంస్థ ఉగ్రవాదులకు సరఫరా చేస్తోంది. కొన్నాళ్ల క్రితం పూంచ్‌ జిల్లాలో నాలుగు మాగ్నెట్‌ బాంబులను భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని