Mamata Banerjee: మోదీజీ.. ఆ ఎన్నిక కోసం దాదాకు అనుమతి ఇవ్వండి..!

కోర్టు ఆదేశాల ప్రకారం సౌరవ్‌ గంగూలీ, బీసీసీఐ కార్యదర్శి జై షా  రెండోసారి పదవులు చేపట్టొచ్చు. కారణం ఏంటో తెలీదు కానీ.. జై షా కొనసాగుతున్నారు.

Published : 17 Oct 2022 17:38 IST

కోల్‌కతా: భారత క్రికెట్‌ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్ష పదవిని మరోసారి దక్కించుకోవాలని భావించిన మాజీ క్రికెటర్ సౌరవ్‌ గంగూలీకి నిరాశే ఎదురైంది. ఈ విషయంలో పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయనకు మద్దతుగా వచ్చారు. ఆయన్ను ఐసీసీకి పంపాలని ప్రధాని నరేంద్రమోదీని అభ్యర్థించారు. 

‘గంగూలీ అన్యాయంగా తన పదవిని కోల్పోయారు. ఆయన చేసిన తప్పేంటి? ఈ విషయం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఎంతో ప్రజాదరణ ఉన్న వ్యక్తి. భారత క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. బెంగాల్‌ ఒక్కటే కాదు.. భారత్‌ గర్వించదగ్గ వ్యక్తి. అనుచితంగా ఆయన్ను ఎందుకు తొలగించారు..? గంగూలీ ఐసీసీ ఎన్నిక కోసం పోటీపడేలా అనుమతి ఇవ్వాలని ప్రధానిని అభ్యర్థిస్తున్నాను. 

కోర్టు ఆదేశాల ప్రకారం అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి రెండోసారి పదవులు చేపట్టొచ్చు. కారణం ఏంటో తెలీదు కానీ.. జై షా కొనసాగుతున్నారు. ఆయనపై నాకేమీ వ్యతిరేకత లేదు. కానీ గంగూలీ ఎందుకు బయటకువెళ్లాల్సి వచ్చింది..? ప్రతీకారం లేక రాజకీయాల కోసం కాకుండా ఆటను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నిర్ణయం తీసుకోండి’ అని మమత పేర్కొన్నారు. 

ఐసీసీ ఛైర్మన్ పదవికి నామినేషన్ వేసేందుకు అక్టోబర్ 20 వరకు అవకాశం ఉంది. కానీ ఆ పదవికి పోటీ చేయాలంటే.. బీసీసీఐ గంగూలీని ప్రతిపాదించాల్సి ఉంటుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని