Xi Jinping: షీజిన్‌పింగ్‌ ప్లాన్ల వెనుక అతడు..!

చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ ఎక్కడికి వెళ్లినా.. బ్యాగ్‌ పట్టుకొని ఒక బక్కపలచని వ్యక్తి ఆయన సమీపలోనే ఉంటాడు. అతని పేరు వాంగ్‌ హుయినింగ్.. ఈ పేరు వార్తల్లో చాలా తక్కువగా

Published : 28 Dec 2021 01:23 IST

 చైనా అధ్యక్షుడి నీడగా వాంగ్‌ హుయినింగ్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ ఎక్కడికి వెళ్లినా.. బ్యాగ్‌ పట్టుకొని ఒక బక్కపలచని వ్యక్తి ఆయన సమీపంలోనే ఉంటాడు. అతని పేరు వాంగ్‌ హుయినింగ్.. ఈ పేరు వార్తల్లో చాలా తక్కువగా వినిపిస్తుంటుంది.  చైనా కమ్యూనిస్టుపార్టీలోని అత్యంత శక్తివంతమైన ఏడుగురు నాయకుల్లో ఒకరు. అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా మాజీ ఎన్‌ఎస్‌ఏ హెన్రీ కిసెంజర్‌కు ఉన్న తెలివితేటలు.. బ్రిటన్‌ మాజీ ప్రధాని మార్గరేట్‌ థాచర్‌ సమర్థత కలిపితే వాంగ్‌ హుయినింగ్ అంటారు విశ్లేషకులు. జిన్‌పింగ్‌కు తొలిటర్మ్‌ పాలన సమయంలో నీడవలే వెన్నంటే ఉన్నారు. జిన్‌పింగ్‌ భారత్‌లోని గుజరాత్‌ పర్యటనలో వాంగ్‌ ఉండటం విశేషం. చైనాలో నిర్వహించే ప్రతి కీలక కార్యక్రమం వెనుక ఈయన వ్యూహరచన ఉంటుంది. వాంగ్‌ రాజకీయ కుటుంబంలో పుట్టలేదు.. రాజకీయాల నుంచి రాలేదు.. ఆయనో విద్యావేత్త.. కానీ, తన మేధస్సుతో, ప్రసంగాలతో ముగ్గురు చైనా అధ్యక్షులు తనపై ఆధారపడేట్లు చేసుకొన్నాడు.

అమెరికా లోపాలను అధ్యయనం చేసి..

షాంఘై విశ్వవిద్యాలయం నుంచి 1974లో ఫ్రెంచి భాషలో పట్టా పొందిన వాంగ్‌ హుయినింగ్.. ఆ తర్వాత ఫుడాన్‌ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాలపై పీజీ చేశారు. 1985లో అదే విశ్వవిద్యాలయంలో లా ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తర్వాత 1988లో విజిటింగ్‌ స్కాలర్‌గా అమెరికాలోని ఐయోవా యూనివర్శిటీకి వెళ్లారు. ఆ తర్వాత అమెరికాలోని 30 నగరాలు, 20 విశ్వవిద్యాలయాలను సందర్శించి అక్కడి సమాజంలో వైరుధ్యాలు, లోపాలపై ‘‘అమెరికా అగైనెస్ట్‌ అమెరికా’’ అనే పుస్తకం రాశారు. దీనిలో అమెరికాలోని ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థల్లోని లోపాలు.. ఉత్తుత్తి తళుకులను ప్రస్తావించారు. 2021లో అమెరికా క్యాపిటల్ హిల్‌పై దాడి తర్వాత ఈ పుస్తకానికి మళ్లీ డిమాండ్‌ వచ్చింది.

1990ల్లో వాంగ్‌ ప్రతిభను నాటి చైనా అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ గమనించారు. వెంటనే సీసీపీ సెంట్రల్‌ పాలసీ రీసెర్చి ఆఫీస్‌లోకి  ఆయన్ను తీసుకొన్నారు. 1998 నాటికి ఆ ఆఫీస్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా.. 2002 నాటికి డైరెక్టర్‌గా ప్రమోట్‌ అయ్యారు.  జియాంగ్‌జెమిన్‌ ‘త్రీ రిప్రజెంటేటీవ్స్‌’భావజాలం తయారీలో వాంగ్‌ పాత్ర చాలా ఉంది. ఆ తర్వాత అధ్యక్షుడు హు జింటావోకు కూడా నమ్మిన బంటుగా వ్యవహరించాడు. హుంజింటావో ‘సైంటిఫిక్‌ అవుట్‌ లుక్‌ ఆన్‌ డెవలప్‌మెంట్‌’  ఐడియాలజీ కూడా వాంగ్‌ మెదడు నుంచి పుట్టిందే.

ప్రత్యర్థుల మనిషి అయినా.. జిన్‌పింగ్‌కు అనుచరుడే..!

చైనా కమ్యూనిస్టు పార్టీలోని జియాంగ్‌ జెమిన్‌ వర్గానికి చెందిన షాంఘై గ్యాంగ్‌ మనిషిగా వాంగ్‌ను చూస్తారు. ప్రస్తుత అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌కు ఇది ప్రత్యర్థి వర్గం. జిన్‌పింగ్‌ పగ్గాలు చేపట్టాక.. ఈ వర్గం వారిని శంకరగిరిమాన్యాలు పట్టించారు. కానీ, వాంగ్‌ హుయినింగ్‌ను ప్రమోట్‌ చేసి తన బృందంలో చేర్చుకొన్నారు. జిన్‌పింగ్‌ విదేశీ పర్యటనల్లో వాంగ్‌ తప్పనిసరిగా ఉంటారు.  2017 నాటికి వాంగ్‌ చైనాలోని అత్యంత శక్తివంతమైన పోలిట్‌ బ్యూరో స్టాండిగ్‌ కమిటీలో సభ్యుడిగా ఎదిగాడు. చైనీస్‌ లక్షణాలతో కూడిన సోషలిజంగా చెప్పే ‘షీజిన్‌పింగ్‌ థాట్స్‌’ పాలసీకు, ‘చైనీస్‌ డ్రీమ్‌’ స్లోగన్‌కు సృష్టి కర్త వాంగ్‌.

సాధారణంగా అధ్యక్షుడి వెన్నంటే ఉన్నా.. ఎక్కడా ప్రచారంలో ఉండకుండా జాగ్రత్తపడతాడు. జియాంగ్‌ జెమిన్‌  సమయం నుంచి అధ్యక్షులతో కలిసి ఉన్న వాంగ్‌ తొలిసారిగా అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది 2017లో..! ఆ ఏడాది చైనా నిర్వహించిన వరల్డ్‌ ఇంటర్నెట్‌ కాన్ఫరెన్స్‌కు జిన్‌పింగ్‌ స్థానంలో హాజరై ప్రసంగించాడు.

పశ్చిమ దేశాల విమర్శకుడు..

ఇటీవల అమెరికా డెమొక్రసీ సదస్సుకు చైనాను ఆహ్వానించలేదు. ఈ సందర్భంగా చైనా విదేశాంగ శాఖ ఓ సందర్భంలో చైనాకు తనదైన శైలిలో ప్రజాస్వామ్యం ఉందని పేర్కొంది. చైనానే అతిపెద్ద ప్రజాస్వామ్యమని వెల్లడించింది. వాస్తవానికి ఈ ఆలోచనా విధానం వాంగ్‌ హుయినింగ్ మెదడు నుంచి వచ్చిందే.  పశ్చిమ దేశాలు పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యాలని.. వాటి లక్ష్యాలు వేరే ఉంటాయని వాంగ్‌ నమ్ముతాడు. అందుకే ‘సోషలిజం విత్‌ చైనీస్‌ క్యారక్టరిస్టిక్స్‌’ అనే హైబ్రీడ్‌ విధానాన్ని రూపొందించాడు. ప్రస్తుత అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ దీనినే పాటిస్తున్నారు. 

భారత ప్రజాస్వామ్యం పశ్చిమ దేశాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని వాంగ్‌ ఓ పుస్తకంలో అభిప్రాయపడ్డారు. 1989లో వాంగ్‌ రాసిన ‘అనాలసిస్‌ ఆఫ్‌ అడ్మిన్‌స్ట్రేటివ్‌ ఎకాలజీ’ పుస్తకంలో వివిధ దేశాల్లో పాలన విధానాలను విశ్లేషించాడు. అమెరికా, యూకే, జపాన్‌లో భద్రతకు తొలిప్రాధాన్యమిస్తే.. భారత్‌లో గౌరవానికి పెద్దపీట వేస్తారని పేర్కొన్నాడు. 

జిన్‌పింగ్‌ అవినీతి వ్యతిరేక ఉద్యమంపై వాంగ్‌ ముద్ర..!

జిన్‌పింగ్‌ ప్రత్యర్థులను అణచివేయడానికి ఎంచుకొన్న బలమైన మార్గం అవినీతి నిర్మూలన ఉద్యమం. ఫలితంగా లక్షల సంఖ్యలో జిన్‌పింగ్‌ వ్యతిరేకులు జైళ్లలో మగ్గుతున్నారు. వాస్తవానికి వాంగ్‌ 1990ల్లో ‘యాంటి కరప్షన్‌: ఎక్సపర్మెంట్‌ ఇన్‌ చైనా’ అనే పుస్తకాన్ని రాశాడు. దీనిలో అవినీతికి కారణాలు, నిర్మూలనకు అవకాశాలు, గతంలో చైనా చేపట్టిన అవినీతి నిర్మూలన కార్యక్రమాలు వంటివి విశ్లేషించాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే షీజిన్‌పింగ్‌ అధికారంలో ఉండేందుకు అవసరమైన వాదనలకు రూపుశిల్పి ఇతడే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని