Modi: ‘మా డబ్బులు అంటున్నారు.. అసలు అదేం భాష..?’: విపక్షాలపై మోదీ ఆగ్రహం

కొవిడ్ వంటి సమయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేశాయని, ఏ విషయంలోనూ రాష్ట్రాలను బట్టి వివక్ష ఉండదని ప్రధాని మోదీ(PM Modi) స్పష్టం చేశారు. 

Published : 07 Feb 2024 18:48 IST

దిల్లీ: ‘మా పన్నులు.. మా డబ్బు.. అసలు అదేం భాష’ అంటూ రాజ్యసభ వేదికగా విపక్ష పార్టీలపై ప్రధాని మోదీ(PM Modi) ఆగ్రహం వ్యక్తంచేశారు. నిధుల అంశం అడ్డం పెట్టుకొని కాంగ్రెస్‌ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. పన్నుల పంపిణీ, సహాయ నిధులు ఇవ్వకుండా కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందంటూ బుధవారం కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర నేతలు దిల్లీలో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని నుంచి ఈ స్పందన వచ్చింది.

‘ప్రభుత్వ నిధుల విషయంలో విభజన రాజకీయాలు ప్రమాదకరం. జాతీయ నిధులపై రాష్ట్రాలు రాజకీయం చేయడం సరికాదు. రాష్ట్రాలకు ఇచ్చే నిధులపై మేం సంకుచిత ఆలోచనలు చేయం.  మా పన్నులు.. మా డబ్బులు అంటున్నారు. అసలు అదేం భాష..? కొవిడ్ వంటి సమయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేశాయి. బెంగళూరు, చెన్నై, తెలంగాణ, పూరీ.. ఇలా అన్ని ప్రాంతాలు నా దేశమే. రాష్ట్రాలను బట్టి వివక్ష ఉండదు’ అని మోదీ విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు.

విపక్షం వదంతులు ప్రచారం చేస్తోంది: మోదీ

‘ప్రతిపక్ష పార్టీ ఎల్‌ఐసీ గురించి వదంతులు ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు ఆ సంస్థ షేర్లు రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే 2014లో 234 ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) ఉన్నాయి. 10 ఏళ్ల తర్వాత వాటి సంఖ్య 254కు చేరింది. వాటి లాభం 2.5 లక్షల కోట్ల రూపాయలకు ఎగబాకింది. నేను స్వతంత్ర భారత్‌లో జన్మించాను. నా ఆలోచనలు కూడా స్వతంత్రంగా ఉంటాయి. మేం పీఎస్‌యూలను విక్రయించామని, వాటిని ధ్వంసం చేశామని కాంగ్రెస్ విమర్శించింది. నేను ఆ పార్టీ నేతలను ఒక ప్రశ్న అడుగుతాను. ఎవరు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ను నిర్వీర్యం చేశారు. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్, ఎయిరిండియా పరిస్థితికి కారణం ఎవరు..? మా హయాంలో అవన్నీ మెరుగైన పనితీరును ప్రదర్శిస్తున్నాయి’ అని వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు