CBI: సీబీఐ కొత్త చీఫ్‌.. ముగ్గురి పేర్లు షార్ట్‌ లిస్ట్‌! 

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి కొత్త డైరెక్టర్‌ నియామకంపై ప్రధాని మోదీ నివాసంలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. సీబీఐ తదుపరి బాస్‌ను ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, లోక్‌సభలో కాంగ్రెస్‌ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురి సమావేశమై

Published : 25 May 2021 01:21 IST

దిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి కొత్త డైరెక్టర్‌ నియామకంపై ప్రధాని మోదీ నివాసంలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. సీబీఐ తదుపరి బాస్‌ను ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, లోక్‌సభలో కాంగ్రెస్‌ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురి సమావేశమై ముగ్గురి పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేసినట్టు సమాచారం. ఈ పదవికి 1984-87 బ్యాచ్‌లకు చెందిన దాదాపు 100 మందికి పైగా అధికారుల పేర్లను ఈ హైపవర్‌ కమిటీ పరిగణనలోకి తీసుకొంది. సాయంత్రం 6.30గంటల నుంచి దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన ఈ ఉన్నత స్థాయి ప్యానల్‌ సమావేశంలో ముగ్గురు అధికారుల పేర్లను షార్ట్‌ లిస్ట్‌ చేసినట్టు సమాచారం. వీరిలో ఉత్తర్‌ప్రదేశ్‌ డీజీపీ హెచ్‌సీ అవస్తీ (1985 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి); సహస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) డీజీ కేఆర్‌ చంద్ర, కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత) వీఎస్‌కే కౌముది పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పదవికి ఎంపికైన వారు రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్టర్‌గా కొనసాగుతారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సీబీఐ డైరెక్టర్‌ ఆర్‌కే శుక్లా పదవీ విరమణ చేయడంతో..  ఆ శాఖలో సీనియర్‌ అధికారి, సంయుక్త డైరెక్టర్‌గా ఉన్న ప్రవీన్‌ సిన్హా తాత్కాలిక డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. నాలుగు నెలల ముందుగానే ఈ కమిటీ సమావేశమై సీబీఐ కొత్త చీఫ్‌ను ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది. సీనియారిటీతో పాటు అవినీతి కేసుల విచారణలో అనుభవం తదితర అంశాల ఆధారంగా కొత్త డైరెక్టర్‌ను ఎంపిక చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని