Hijab Row: హిజాబ్‌ వివాదంపై ఇతర దేశాల కామెంట్లు.. కేంద్రం ఆగ్రహం

దక్షిణాది రాష్ట్రం కర్ణాటకను కుదిపేస్తోన్న ‘హిజాబ్‌ వస్త్రధారణ’ వివాదం దేశవ్యాప్తంగానే గాక, అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఇటీవల కొందరు విదేశీ ప్రముఖులతో

Published : 12 Feb 2022 11:44 IST

దిల్లీ: దక్షిణాది రాష్ట్రం కర్ణాటకను కుదిపేస్తున్న ‘హిజాబ్‌ వస్త్రధారణ’ వివాదం దేశవ్యాప్తంగానే గాక, అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఇటీవల కొందరు విదేశీ ప్రముఖులతో పాటు కొన్ని దేశాలు కూడా దీనిపై స్పందిస్తూ వ్యాఖ్యలు చేశాయి. దీంతో ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అంతర్గత విషయాలపై రెచ్చగొట్టే కామెంట్లు చేయడం తగదని సూచించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘కర్ణాటకలోని కొన్ని విద్యాసంస్థలో డ్రెస్‌కోడ్‌ అంశాన్ని ప్రస్తుతం కర్ణాటక ఉన్నత న్యాయస్థానం పరిశీలిస్తోంది. మా రాజ్యాంగ విధివిధానాలు, ప్రజాస్వామ్య నియమాలకు అనుగుణంగా ఆ వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. భారత్‌ గురించి పూర్తిగా తెలిసిన వారు ఈ వాస్తవాలను అర్థం చేసుకుంటారు. అయితే మా అంతర్గత సమస్యలపై ప్రేరేపించే వ్యాఖ్యలను ఎన్నటికీ స్వాగతించబోం’’ అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

కర్ణాటకలో గత కొన్ని రోజుల క్రితం మొదలైన హిజాబ్‌ వస్త్రధారణ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై కొన్ని దేశాలకు చెందిన వ్యక్తులు స్పందిస్తూ.. కర్ణాటక ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. అటు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఇంటర్నేషనల్ రిలీజియస్‌ ఫ్రీడమ్‌ కూడా ఈ వివాదంపై స్పందించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర విదేశాంగ శాఖ ఈ ప్రకటన జారీ చేసింది.

మరోవైపు ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తుది తీర్పు వెల్లడించే వరకు సంప్రదాయ వస్త్రాలతో విద్యా సంస్థలకు హాజరుకారాదని గురువారం మౌఖిక తీర్పు వెల్లడించిన హైకోర్టు.. శుక్రవారం దాని లిఖితపూర్వక ప్రతిని విడుదల చేసింది. తరగతులకు హిజాబ్‌ ధరించి హాజరవటం రాజ్యాంగం కల్పించిన అనివార్య వస్త్రధారణ పరిధిలోనికి వస్తుందా? రాదా? అన్న అంశంపై లోతైన అధ్యయనం అవసరమన్న ఉన్నత న్యాయస్థానం.. దీనిపై ఇతర కోర్టుల తీర్పులను పరిశీలించాలని పేర్కొంది. అప్పటిదాకా సాధారణ పరిస్థితుల్లో తరగతులు నిర్వహించే వాతావరణాన్ని కర్ణాటక ప్రభుత్వం కల్పించాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని