Sanjay Raut: సంజయ్‌ రౌత్‌కు దక్కని ఊరట.. మరో 14 రోజులు జ్యుడీషియల్‌ కస్టడీకి..!

పాత్రాచాల్‌ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టైన శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ఊరట లభించలేదు. ఈ కేసులో ఆయనను మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగిస్తూ

Updated : 08 Aug 2022 18:41 IST

ముంబయి: పాత్రాచాల్‌ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టైన శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ఊరట లభించలేదు. ఈ కేసులో ఆయనను మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగిస్తూ ముంబయిలోని ప్రత్యేక కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

గోరేగావ్‌ శివారులోని పాత్రాచాల్‌ రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగానే ఆగస్టు 1న ఈడీ అధికారులు సంజయ్‌ రౌత్‌ను అరెస్టు చేశారు. తొలుత ప్రత్యేక కోర్టు ఈ నెల 4 వరకు ఈడీ కస్టడీకి అనుమతించగా.. ఆ తర్వాత దాన్ని 8వ తేదీ వరకు పొడగించింది.

ఆ కస్టడీ నేటితో ముగియడంతో ఈడీ ఆయన్ను కోర్టులో హాజరుపర్చింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ రౌత్‌ కస్టడీని పొడగించమని కోరలేదు. దీంతో న్యాయస్థానం ఆయనను 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. కస్టడీ సమయంలో ఇంటి భోజనం, మందుల కోసం రౌత్‌ చేసిన అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. అయితే ప్రత్యేక బెడ్డును కేటాయించే విషయంలో ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. జైలు నియమాల ప్రకారం.. అధికారులు తగిన పడక ఏర్పాట్లు చేస్తారని కోర్టు స్పష్టం చేసింది.

కాగా.. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సంజయ్‌ రౌత్‌ భార్య వర్షా రౌత్‌కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో గత శనివారం ఆమె దర్యాప్తు సంస్థ ఎదుట విచారణకు హాజరయ్యారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని