NCERT: పాఠ్యపుస్తకాల్లో ఇండియా స్థానంలో ‘భారత్‌’..?

పాఠ్యపుస్తకాల్లో ఇండియా స్థానంలో ‘భారత్‌’ను చేర్చాలని ఎన్‌సీఈఆర్‌టీ కమిటీ సిఫార్సు చేసింది.

Updated : 25 Oct 2023 17:35 IST

దిల్లీ: పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేర్పుల విషయంలో కీలక సిఫార్సులతో ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) కమిటీ ముందుకొచ్చింది. అన్ని పాఠ్యపుస్తకాల్లో ఇండియా స్థానంలో ‘భారత్‌ (Bharat)’ను చేర్చాలని సిఫార్సు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈమేరకు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. దీంతోపాటు పుస్తకాల్లో ‘ప్రాచీన చరిత్ర’కు బదులుగా ‘సంప్రదాయిక చరిత్ర (Classical History)’ను ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసినట్లు కమిటీ ఛైర్మన్‌, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ICHR) సభ్యుడు సీఐ ఐజాక్‌ తెలిపారు. అన్ని సబ్జెక్టుల సిలబస్‌లో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ (IKS)ను ప్రవేశపెట్టాలని కూడా సిఫార్సు చేసింది. అయితే.. ఈ కమిటీ చేసిన సిఫార్సులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఎన్‌సీఈఆర్‌టీ అధికారులు తెలిపారు. ప్యానెల్ సిఫార్సులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్‌సీఈఆర్‌టీ ఛైర్మన్ దినేష్ సక్లానీ స్పష్టంచేశారు.

పాఠ్యపుస్తకాల్లో ఇండియా బదులు ‘భారత్’ పేరును ఉపయోగించాలని కమిటీ ఏకగ్రీవంగా సిఫార్సు చేసినట్లు సీఐ ఐజాక్ చెప్పినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. వివిధ యుద్ధాల్లో హిందూ పాలకులు సాధించిన విజయాలనూ ప్రముఖంగా పేర్కొనాలని కూడా కమిటీ ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. ‘ప్రస్తుత పాఠ్యపుస్తకాల్లో మన వైఫల్యాల గురించి ఉన్నాయి. కానీ, మొఘలులు, సుల్తానులపై సాధించిన విజయాల గురించి లేవు’ అని ఐజాక్ అన్నారు. ఈ కమిటీలో ఐసీహెచ్ఆర్‌ ఛైర్‌పర్సన్ రఘువేంద్ర తన్వర్, జేఎన్‌యూ ప్రొఫెసర్‌ వందనా మిశ్రా, డెక్కన్ కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీ మాజీ వీసీ వసంత్ శిందే, హరియాణా ప్రభుత్వ పాఠశాలలో సామాజిక శాస్త్రాన్ని బోధిస్తున్న మమతా యాదవ్‌లూ ఉన్నారు.  అయితే, మీడియా కథనాలపై పాఠ్యపుస్తకాలు, కొత్త సిలబస్‌ రూపకల్పన ప్రక్రియ కొనసాగుతోందని, దీనిపై ఇప్పుడే స్పందించడం తొందరపాటే అవుతుందని ఎన్‌సీఈఆర్‌టీ పేర్కొంది. 

ఇండియా..? భారత్‌..? రాజ్యాంగం, సుప్రీంకోర్టులు ఏం చెబుతున్నాయి?

ఇదిలా ఉండగా.. ‘జాతీయ విద్యావిధానం 2020’కి అనుగుణంగా ఎన్‌సీఈఆర్‌టీ.. స్కూలు పుస్తకాల పాఠ్యాంశాలను సవరిస్తోంది. పాఠ్యాంశాలు, పుస్తకాలు, అభ్యాస సామగ్రిని ఖరారు చేయడానికి కౌన్సిల్ ఇటీవల 19 మంది సభ్యులతో ‘నేషనల్ సిలబస్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కమిటీ (NSTC)’ని ఏర్పాటు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని