Parliament: నేర శిక్షాస్మృతి బిల్లులకు రాజ్యసభ ఆమోదం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్‌ చట్టాల బిల్లులకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లులు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.

Updated : 21 Dec 2023 23:41 IST

దిల్లీ:  ప్రస్తుతం అమలవుతున్న భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి(సీఆర్‌పీసీ), సాక్ష్యాధారాల చట్టం(ఎవిడెన్స్‌ యాక్ట్‌) స్థానంలో కేంద్రం ప్రభుత్వం కొత్తగా మూడు నేర శిక్షాస్మృతి బిల్లులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లులకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక సురక్ష సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌) బిల్లులు బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందగా.. గురువారం వాటిని రాజ్యసభలో ప్రవేశపెట్టారు.ఈ బిల్లులపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. ఈ కొత్త బిల్లుల ద్వారా న్యాయ ప్రక్రియను వేగవంతం చేశామని, చట్టాలను సులభతరంగా మార్చామని చెప్పారు. ఈ మూడు కొత్త న్యాయ చట్టాల ఆత్మ, ఆలోచన పూర్తిగా భారతీయమని తెలిపారు. శిక్షలు అమలు చేయడం కాదు.. న్యాయం చేయడమే ఈ బిల్లుల ప్రధాన ఉద్దేశమన్నారు. మోదీ ప్రభుత్వం 2019 నుంచి ఈ బిల్లులపై కసరత్తు చేస్తోందని పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఉభయసభల్లో కొత్త న్యాయ బిల్లులు ఆమోదం పొందడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి చెప్పి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని