Covid Vaccination: టీకా తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయలేం

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. టీకా తీసుకోమని ఎవరినీ బలవంతం చేయలేమంటూ సోమవారం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

Published : 02 May 2022 13:35 IST

కీలక తీర్పు ఇచ్చిన సుప్రీం

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. టీకా తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయలేమంటూ సోమవారం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించవచ్చని పేర్కొంది. పలు సేవలు పొందేందుకు టీకాను తప్పనిసరి చేయడం రాజ్యాంగ విరుద్ధమేనని పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా రవాణాను వినియోగించుకోవడానికి, సబ్సిడీలో ఆహార ధాన్యాలు పొందడానికి పలు రాష్ట్రాలు టీకాను తప్పనిసరిచేయడాన్ని ఈ పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ క్రమంలో జస్టిస్ ఎల్ నాగేశ్వర్రావు, జస్టిస్ బీఆర్ గావైతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పు ఇచ్చింది.

‘శరీర సమగ్రతకు చట్టం ప్రకారం రక్షణ ఉంది. ఎవరినీ టీకాలు తీసుకోవాలని బలవంతం చేయలేం. అలాగే ప్రస్తుత టీకా విధానం అసమంజసంగా ఉందనీ చెప్పలేం. శాస్త్రీయతపై ఇది ఆధారపడి ఉంది. అంతేగాకుండా వైరస్ ఇన్ఫెక్షన్లు తక్కువగా ఉన్నంతవరకూ.. ప్రజలు బహిరంగ ప్రదేశాలు, ఇతర సేవలు పొందే విషయంలో ఆంక్షలు విధించకూడదు. అయితే ఈ సూచన కొవిడ్ నియమావళిని పాటించాలనే ప్రభుత్వ విధానానికి విరుద్ధంగా ఉండకూడదు’ అని స్పష్టంగా తెలియజేసింది. అలాగే వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రతికూల ప్రభావాలపై వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిన్నారులకు టీకా అందించే విషయం గురించి స్పందిస్తూ ఇదే ఆదేశం ఇచ్చింది. సాధ్యమైనంత త్వరగా ఆ సమాచారాన్ని వెల్లడించాలని చెప్పింది.

ఈ పిటిషన్ విషయంలో ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. ఇది జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమని, టీకాపై సందేహాలను సృష్టిస్తుందని వ్యాఖ్యానించింది. టీకాలు వేయడం స్వచ్ఛందమని, వైరస్ ముప్పు ఆధారంగా రాష్ట్రాలు ఆదేశాలు ఇస్తాయని వాదించింది. అలాగే టీకా ట్రయల్ సమాచారం ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉందని తయారీ సంస్థలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని